NV Ramana: సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా ఎన్వీ రమణ
NV Ramana: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ నియమించే అవకాశాలున్నాయి.
NV Ramana: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ నియమించే అవకాశాలున్నాయి. ప్రస్తుత సీజేఐ జస్టిస్ బోబ్డే ఏప్రిల్ 23న రిటైర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో జస్టిస్ ఎన్వీ రమణ పేరును సీజేఐగా జస్టిస్ బోబ్డే ప్రతిపాదించారు. రాష్ట్రపతికి ప్రతిపాదనలు పంపిన జస్టిస్ బోబ్డే.. అటు న్యాయశాఖకు కూడా లేఖ రాశారు.
కృష్ణా జిల్లా పొన్నవరం గ్రామంలో 1957 ఆగస్టు 27న జన్మించారు ఎన్‌వీ రమణ. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఆయన బీఎస్సీ, బీఎల్ చేశారు. 1983లో న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించారు. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్, ఉమ్మడి ఏపీ హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో ప్రాక్టీసు చేశారు. వివిధ ప్రభుత్వ సంస్థలకు పానెల్ కౌన్సిల్‌గా ఉన్నారు. క్యాట్‌లో కేంద్ర ప్రభుత్వం, రైల్వేల తరఫున పనిచేశారు.
చంద్రబాబు హయాంలో ఏపీ అదనపు అడ్వకేట్ జనరల్‌గా పనిచేసిన ఆయన.. 2000 జూన్‌లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పర్మినెంట్ జడ్జిగా నియమితులయ్యారు. 2013 మార్చి 10 నుంచి మే 20 వరకు ఏపీ హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్‌గా పనిచేశారు. 2013లో ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా పదోన్నతి పొందారు. ఆ తర్వాత 2014 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియామకమయ్యారు.
జస్టిస్ బోబ్డే ప్రతిపాదనకు రాష్ట్రపతి ఆమోదం లభిస్తే ఎన్వీ రమణ సీజేఐగా నియమితులవుతారు. అయితే సీనియార్టీ పరంగా ప్రస్తుత సీజేఐ బోబ్డే తర్వాత స్థానంలో ఎన్వీ రమణ ఉన్నారు. దీంతో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఎన్వీ రమణ నియామకం దాదాపు ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్వీ రమణకు ఇంకా రెండేళ్ల పదవీ కాలం ఉండటంతో 2022 ఆగస్టు 26 వరకు ఆయన చీఫ్ జస్టిస్‌గా కొనసాగనున్నారు.