China: గల్వాన్ లోయ ఘర్షణల్లో మా సైనికులు చనిపోయారు

గల్వాన్ లోయ ఘర్షణల్లో చనిపోయిన నలుగురు సైనికులకు హానరరీ టైటిల్‌తో సెంట్రల్ మిలటరీ కమిషన్ గౌరవించింది.

Update: 2021-02-19 09:02 GMT

 file image

గాల్వాన్ సరిహద్దుల్లో చెలరేగిన ఘర్షణలో తమ సైనికులు చనిపోలేదని బీరాలు పలికిన చైనా ప్రభుత్వం... ఎట్టకేలకు ఎనిమిది నెలల తరువాత తన స్వరాన్ని సవరించుకుంది. అంతేకాదు గల్వాన్ లోయ ఘర్షణల్లో ప్రాణ త్యాగం చేసిన నలుగురు సైనికులకు హానరరీ టైటిల్‌తో సెంట్రల్ మిలటరీ కమిషన్ గౌరవించింది. ఆ రోజు చైనా (China) జవాన్లకు నాయకత్వం వహించిన కల్నల్‌కు కూడా అవార్డును ప్రకటించింది. ప్రాణత్యాగం చేసిన వారిలో చెన్ హాంగ్‌జున్, చెన్ జియాన్‌గ్రాంగ్, గ్జియో సియువాన్, వాంగ్ జోరాన్ ఉన్నట్లు పేర్కొంది. ఈ మేరకు చైనాకు చెందిన పీపుల్స్ డైలీ కథనాన్ని ప్రచురించింది. కల్నల్ కీ ఫాబో తీవ్రంగా గాయపడినట్లు తెలిపింది.

భారత్ (India), చైనా సరిహద్దుల్లో కొన్ని నెలలుగా ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. లద్దాఖ్‌కు తూర్పున ఉన్న సరిహద్దు ప్రాంతాల్లో ఇరు దేశాల బలగాలు పలుమార్లు ఘర్షణ పడ్డాయి. గత ఏడాది జూన్‌లో జరిగిన గల్వాన్ లోయ ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మన అమర వీరులకు యావత్ భారతం కన్నీటితో వీడ్కోలు పలికింది. కానీ ఆ ఘర్షణలో చైనా వైపు కూడా భారీగా ప్రాణనష్టం సంభవించిందని ప్రపంచదేశాలు కోడై కూసినప్పటికి కానీ చైనా ఆ విషయాన్ని బయటపెట్టలేదు. ఐతే గల్వాన్ లోయ ఘర్షణతో చైనా సైనికుల మరణంపై తొలిసారిగా స్పందించింది. ఆ ఘటనలో మరణించిన వారి పేర్లు, వివరాలను బయటపెట్టింది.

గాల్వాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నివారణకు ఇరుదేశాలు అనేక సార్లు చర్చలు జరిపాయి. ఈ సమయంలో వాస్తవాధీన రేఖ నుంచి భారత్ వైపు గాల్వాన్ వ్యాలీలో శిబిరాల ఏర్పాటుకు చైనా ప్రయత్నించిందని.. వివాదానికి ఇది కారణం కాగా చైనా సైనికులు హింస, మరణాలకు కారణమయ్యేలా ఘర్షణలను నేరుగా ప్రేరేపించారని జయశంకర్ చైనా మంత్రితో తెలిపిన విషయం తెలిసిందే.)

Tags:    

Similar News