Char Dham Yatra 2023: ఈ నెల 30 వరకు కేదార్‌నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్ల నిలిపివేత
Char Dham Yatra 2023: రిషికేశ్, హరిద్వార్‌లో వర్షం కారణంగా రిజిస్ట్రేషన్లు బంద్
Char Dham Yatra 2023: కేదార్‌నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్లను ఏప్రిల్ 30 వరకు నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. గర్వాల్ హిమాలయ ఎగువ ప్రాంతం రిషికేశ్, హరిద్వార్‌లో వర్షం, మంచు తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్లే రిషికేశ్‌లో ఈ నెల 30 వరకు యాత్రికుల నమోదును నిలిపివేసినట్లు గర్వాల్ డివిజన్ అడిషనల్ కమిషనర్, చార్‌ధామ్ యాత్ర నిర్వహణ సంస్థ అడిషనల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నరేంద్ర సింగ్ కవిరియాల్ తెలిపారు.
రాబోయే రోజుల్లో వాతావరణ పరిస్థితులను సమీక్షించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. గర్వాల్ హిమాలయ ఎగువ ప్రాంతాల్లో ఎడతెరిపి లేని వర్షం, మంచు వల్ల టెంపరేచర్లు గణనీయంగా పడిపోయాయన్నారు. మంచును తొలగించడంలో అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెల్లడించారు. అయితే..బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి సందర్శన కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతోందని తెలిపారు. గంగోత్రి, యమునోత్రి పుణ్యక్షేత్రాలను శనివారం తెరవగా, కేదార్నాథ్ఆలయం ఈ నెల 25న, బద్రీనాథ్ టెంపుల్ ఈ నెల 27న తెరుచుకుంటాయి. ఇప్పటివరకు దేశ, విదేశాల నుంచి 16 లక్షల మందికి పైగా చార్‌ధామ్ యాత్ర కోసం రిజిస్టర్ చేసుకున్నారని అధికారులు తెలిపారు.