CBI In Kolkata Case: కోల్‌కతా డాక్టర్ రేప్, మర్డర్ కేసులో సీబీఐ చార్జ్‌షీట్.. నిందితుడి పేరు హైలైట్

Update: 2024-10-07 13:50 GMT

CBI Chargesheet in RG Kar Medical College Case: సంచలనం సృష్టించిన కోల్‌కతా ట్రైనీ డాక్టర్ రేప్, మర్డర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా ఈ కేసులో చార్జ్ షీట్ నమోదు చేసిన సీబీఐ, ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కుంటున్న సంజయ్ రాయ్ ఆ డాక్టర్‌ని రేప్ చేసి హత్య చేసినట్లుగా పేర్కొంది. బ్రేక్ సమయంలో ఆర్జి కార్ హాస్పిటల్ ఆవరణలోని సెమినార్ గదిలో విశ్రాంతి తీసుకునేందుకు వెళ్లిన డాక్టర్‌పై సంజయ్ రాయ్ ఈ నేరానికి ఒడిగట్టినట్లుగా సీబీఐ స్పష్టంచేసింది.

ఇప్పటివరకు దాదాపు 200 మంది వాంగ్మూలాలు తీసుకున్నామని, వాళ్లందరూ కూడా సంజయ్ రాయ్‌నే నిందితుడిగా పేర్కొన్నట్లు సీబీఐ అధికారులు తెలిపారు. అయితే, అదే సమయంలో కోల్‌కతా డాక్టర్‌పై గ్యాంగ్ రేప్ జరిగిందా? ఒకరికంటే ఎక్కువ మంది ఈ నేరంలో పాల్గొన్నారా అనే విషయం ఇంకా దర్యాప్తులోనే ఉందని చెప్పడం గమనార్హం.

ఆగస్టు 9న జరిగిన ఈ హత్య కేసుని తొలుత కోల్‌కతా పోలీసులు దర్యాప్తు చేశారు. ఆ తరువాత పశ్చిమ బెంగాల్ హై కోర్టు ఈ కేసుని విచారించింది. అయితే, పశ్చిమ బెంగాల్ సర్కారుపై తీవ్ర విమర్శలు రావడంతో ఈ కేసు పశ్చిమ బెంగాల్ పరిధి దాటి సీబీఐ చేతికి వెళ్లింది. 

సీబీఐ దర్యాప్తుతో వెలుగులోకొచ్చిన ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ నేరాలు

సీబీఐ ఈ కేసు విచారణ చేపట్టిన క్రమంలో ఆర్.జి. కార్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ తన విధి నిర్వహణలో అనేక అవకతవకలకు పాల్పడిన విషయాలు వెలుగులోకొచ్చాయి. అనాథ శవాలతో వ్యాపారం మొదలుకుని మెడికల్ కాలేజ్ సిబ్బంది నియామకాల వరకు ప్రిన్సిపల్ సందీష్ ఘోష్ అనేక నేరాలకు పాల్పడినట్లు తేలింది. అవే ఆరోపణల కింద సీబీఐ ఆయనపై కేసు నమోదు చేసింది. అవినీతి నేరారోపణలు రావడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా సందీప్ ఘోష్‌పై కేసు నమోదు చేసింది. ఈ రెండు వేర్వేరు కేసుల్లో సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సందీప్ ఘోష్‌ని అరెస్ట్ చేశారు.

Tags:    

Similar News