భారత సరిహద్దులో సొరంగం కలకలం

Underground Tunnel: ఇటీవల జమ్ము కశ్మీర్‌లో ఉగ్రచర్యలు తీవ్రమయ్యాయి.

Update: 2022-05-05 09:43 GMT

భారత సరిహద్దులో సొరంగం కలకలం

Underground Tunnel: ఇటీవల జమ్ము కశ్మీర్‌లో ఉగ్రచర్యలు తీవ్రమయ్యాయి. సరిహద్దులోని సాంబా ప్రాంతంలో పాకిస్థాన్‌కు అత్యంత సమీపంలో ఓ సొరంగాన్ని సరిహద్దు భద్రతా దళం-బీఎస్‌ఎఫ్‌ గుర్తించింది. పాకిస్థాన్‌కు చెందిన ఇద్దరు జైషే మహ్మద్​ సూసైడ్​ బాంబర్లు ఈ టన్నెల్‌ ద్వారా దేశంలోకి చొరబడినట్టు భద్రతా దళాలు భావిస్తున్నాయి. ఈ సొరంగం పాక్‌ నుంచి భారత్‌లోకి తవ్వి ఉంటారని దీని పొడవు 150 మీటర్ల ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సొరంగం పాకిస్థాన్‌కు చెందిన పోస్టు చమన్‌ ఖర్ద్‌కు 50 మీటర్ల దూరంలో ఉన్నట్టు భద్రతా బలగాలు వెల్లడించారు. అంతర్జాతీయ సరిహద్దులో 16 నెలల తరువాత తొలిసారి సొంరంగం బయటపడినట్టు బీఎస్‌ఎఫ్‌ ప్రకటించింది.

జమ్మూకశ్మీర్‌లోని సాంబా ప్రాంతంలో చక్‌ ఫక్విరా సరిహద్దు ఔట్‌పోస్టు పరిధిలో 150 మీటర్ల పొడవైన సొరంగాన్ని గుర్తించామని జమ్ము ఐజీ డీకే బోరా తెలిపారు. అమరనాథ్‌ యాత్రికులను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగేందుకు పాకిస్థాన్‌ ఉగ్రవాదులు కుట్ర పన్ని ఉంటారని ఐజీ చెప్పారు. అయితే ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేశామన్నారు. సొరంగాన్ని ఇటీవలే తవ్వారని దానిలో నిల్వ చేసిన 21 ఇసుక బస్తాలను స్వాధీనం చేసుకున్నట్టు బోరా వివరించారు. భారత సరిహద్దు ఔట్‌ పోస్టుకు 300 మీటర్ల దూరంలో సరిహద్దులోని చివరి గ్రామానికి 700 మీటర్లలో ఈ సొరంగం ఉందని ఐజీ బోరా స్పష్టం చేశారు.

ఇటీవల ఉగ్రవాద చర్యలు తీవ్రమయ్యాయి. ప్రధాని జమ్మూ పర్యటన సందర్భంలోనూ టెర్రరిస్టులు రెచ్చిపోయారు. కూంబింగ్‌ ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఓ భద్రతా అధికారి మృతి చెందాడు. గత నెల 22న సుంజ్వాన్‌ ప్రాంతంలో సీఐఎస్‌ఎఫ్‌ బలగాలు ప్రయాణిస్తున్న బస్సును లక్ష్యంగా చేసుకుని ఇద్దరు సుసైడ్ బాంబర్లు దాడికి దిగారు. ఈ ఘటనలో ఏఎస్‌ఐ ప్రాణాలను కోల్పోయారు. అదే రోజు జరిపిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఘటన జరిగిన 14 రోజులకు సొరంగాన్ని భద్రతా అధికారులు గుర్తించారు. ఈ సొరంగం బయటపడిన తరువాత అమర్‌నాథ్‌ యాత్రకు మరింత భద్రత కల్పిస్తున్నారు. మరోవైపు అమర్‌నాత్‌ యాత్రకు ఉగ్రముప్పు పొంచినట్టు నిఘా వర్గాలు హెచ్చరిస్తూనే ఉన్నాయి. ఈ ఏడాది జూన్‌ 30 నుంచి అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభం కానున్నది. 2017లో అమర్‌నాథ్‌ యాత్రికుల బస్సుపై లష్కరే తోయిబా ఉగ్రవాదులు దాడులు నిర్వహించారు. అ ఘటనలో అప్పట్లో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. 

Tags:    

Similar News