దుబ్బాక, గ్రేటర్ ఫలితాలు నింపిన జోష్‌తో త్వరలో జరగబోయే అన్ని ఎన్నికల్లో సత్తాచాటాలని బీజేపీ స్కెచ్ వేస్తోంది. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జి తరుణ్ చుగ్ అడుగులు వేస్తున్నారు. సిట్టింగ్ స్థానాల్లో సత్తా చాటడంతో పాటు ఈ రీసౌండ్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వినిపించాలని భావిస్తున్నారు. ఇంతకీ కమలనాథుల వ్యూహాలు ఎలా ఉన్నాయ్ ?
టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం తామే అంటున్న కమలనాథులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. దుబ్బాక, గ్రేటర్ ఫలితాలు నింపిన జోష్‌తో అదే రేంజ్ రిజల్ట్స్ త్వరలో జరగబోయే ఎన్నికల్లోనూ రిపీట్ చేయాలని భావిస్తున్నారు. బూత్ స్థాయి నుంచి కమిటీలను బలోపేతం చేస్తున్నారు. ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలతో పాటు రెండు పట్టభద్రుల స్థానాలకు కోఆర్డినేటర్లను నియమించింది పార్టీ నాయకత్వం. అర్బన్ ఏరియాల్లో సత్తాచాటిన బీజేపీ గ్రామాల్లోనూ బలోపేతం అయి 2023 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేస్తోంది. ఇందుకోసం నేతలంతా వరుస పర్యటనలతో బిజీబిజీగా గడుపుతున్నారు.
ఇక అటు త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికపై పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించిన తరుణ్ చుగ్ అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. రాబోయే రెండు నెలల కోసం మండలాల వారీ సమస్యలపై రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయ్. పట్టభద్రుల స్థానాలకు సంబంధించి ప్రతీ 10 నుంచి 50 మంది ఓటర్లకు ఒక ఇంచార్జిని నియమించాలని తరుణ్ చుగ్ సూచించారు.
హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ స్థానాన్ని మరోసారి కైవసం చేసుకుంటామని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో 5లక్షల 80వేల ఓట్లు నమోదవగా అందులో 3లక్షలకు పైగా బీజేపీ అనుబంధ సంస్థలే నమోదు చేయించాలని చెప్తున్నారు. నిరుద్యోగుల తరఫున పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని దుబ్బాక, గ్రేటర్ ఫలితాలే రానున్న ఎన్నికల్లో రిపీట్ అవుతాయని చెప్తున్నారు.