BJP Manifesto: జమ్మూకశ్మీర్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల సందర్భంగా ఆర్టికల్ 370 పై అమిత్ షా కీలక వ్యాఖ్యలు

Update: 2024-09-06 12:12 GMT

BJP J&K Election Manifesto శ్రీనగర్: జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తాజాగా బీజేపి అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సంకల్ప పత్ర పేరుతో బీజేపి మేనిఫెస్టో విడుదల చేశారు. జమ్ముకశ్మీర్ ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపి 25 హామీలను పొందుపరిచింది. అందులో మొదటిగా కశ్మీర్ లోయలో ఉగ్రవాదాన్ని, ప్రతేకవాదాన్ని సమూలంగా నివారిస్తాం అని బీజేపి హామీ ఇచ్చింది. ఆ తరువాతి స్థానంలో మహిళలకు ఆర్థిక భద్రత కల్పించడంతో పాటు మహిళలు వారి కాళ్లపై వాళ్లు నిల్చునేలా వారికి సాధికారత కల్పించనున్నట్లు హామీనిచ్చింది.

సంకల్ప పత్ర విడుదల సందర్భంగా అమిత్ షా మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 అనేది ఒక చరిత్రగానే మిగిలిపోతుందన్నారు. ఆర్టికల్ 370 ని తిరిగి తీసుకురావడం అనేది అసాధ్యం అని అమిత్ షా ప్రకటించారు. ఈ అంశంపై వస్తున్న వదంతులని కొట్టిపారేస్తూ అమిత్ షా ఈ ప్రకటన చేశారు. 

స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి జమ్మూకశ్మీర్ అంశాన్ని బీజేపి తొలి ప్రాధాన్యతగా భావిస్తూ వస్తోంది. జమ్మూకశ్మీర్ భారత్ లోనే ఉండేలా చూసేందుకు బీజేపి అన్నివిధాల కృషి చేస్తోందన్నారు. పండిట్ ప్రేమ్ నాథ్ డోగ్రా పోరాటం నుండి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ త్యాగం వరకు అందరూ అందుకోసమే కృషిచేశారు. అప్పట్లో జన సంఘ్ చేసిన ఆ పోరాటాన్ని ఆ తరువాత బీజేపి ముందుకు తీసుకెళ్తోంది అని అమిత్ షా అభిప్రాయపడ్డారు. అంతేకాదు.. జమ్మూకశ్మీర్ ఎప్పటికీ భారత్ లో భూభాగంగానే ఉంటుందని అమిత్ షా స్పష్టంచేశారు. 

జమ్మూకశ్మీర్‌లో సెప్టెంబర్ 18న తొలి విడత ఎన్నికలు జరగనున్నాయి. సెప్టెంబర్ 25న రెండో విడత, అక్టోబర్ 1న జరిగే మూడో విడత ఎన్నికలతో కశ్మీర్ ఎన్నికలు ముగియనున్నాయి. అక్టోబర్ 8వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నారు. 

Tags:    

Similar News