Anant Ambani padayatra: Z ప్లస్ సెక్యురిటీ మధ్య అనంత్ అంబానీ పాదయాత్ర... జామ్‌నగర్ నుండే ఎందుకంటే..

Update: 2025-04-01 09:13 GMT

Anant Ambani padayatra: Z ప్లస్ సెక్యురిటీ మధ్య అనంత్ అంబానీ పాదయాత్ర... జామ్‌నగర్ నుండే ఎందుకంటే.. 

Anant Ambani padayatra from Jamnagar to Dwaraka: అనంత్ అంబానీ మరోసారి వార్తల్లోకొచ్చారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ డైరెక్టర్ హోదాలో ఉన్న అనంత్ అంబానీ ప్రస్తుతం గుజరాత్‌లోని జామ్ నగర్ నుండి ద్వారకాకు పాదయాత్ర చేస్తున్నారు. ఐదు రోజుల క్రితమే మొదలైన ఈ పాదయాత్ర మరో 2-3 రోజుల్లో ముగియనుందని అనంత్ అంబానీ తెలిపారు. పాదయాత్రలో ఉన్న ఆయన మార్గం మధ్యలో మీడియాతో మాట్లాడారు. ద్వారకాలో ఉన్న శ్రీకృష్ణుడిని దర్శించుకునేందుకు ఆయన పాదయాత్రగా వెళ్తున్నారు. ఈ సందర్భంగా అనంత్ అంబానీ మాట్లాడుతూ, అందరికీ ఆ ద్వారకాదీశుడి ఆశీస్సులు ఉంటాయని కోరుకుంటున్నట్లు చెప్పారు.

ద్వారకాదీశుడిపై యువత భక్తిభావంతో, నమ్మకంతో ఉండాలన్నారు. ఏదైనా పని మొదలుపెట్టే ముందు మొదట ఆ ద్వారకాదీశుడిని తలుచుకుంటే, మీరు చేసే పనిలో ఏ అడ్డంకులు లేకుండా విజయవంతంగా పూర్తి అవుతుందని ధీమా వ్యక్తంచేశారు.

జామ్‌నగర్ నుండే ఎందుకంటే...

అంబానీ కుటుంబానికి గుజరాత్‌లోని జామ్‌నగర్‌తో మంచి అనుబంధం ఉంది. గుజరాత్ వారి సొంత రాష్ట్రం అనే విషయం తెలిసిందే. అలాగే 25 ఏళ్ల క్రితమే అంబానీ జామ్‌నగర్‌లో ఆయిల్ రిఫైనరీ ఇండస్ట్రీ స్థాపించారు. అలా జామ్ నగర్ వారికి వ్యాపారరీత్యా వర్క్ ప్లేస్ అయింది. అంతేకాకుండా అది ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ పుట్టిన ఊరు. ఆ విధంగా అక్కడ వారికి స్థిర నివాసం కూడా ఏర్పడింది. అందుకే అనంత్ అంబానీ జామ్‌నగర్ నుండి తన పాదయాత్ర ప్రారంభించారు.

అనంత్ అంబానికి Z+ సెక్యురిటీ

అనంత్ అంబానీ రోజూ 10-12 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నారు. పగటి వేళ ఎండవేడి, ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటుండటంతో రాత్రివేళలో పాదయాత్ర చేస్తున్నారు. హై ప్రొఫైల్ నేపథ్యం ఉన్న పెద్ద వ్యాపారవేత్త తనయుడు కావడంతో కేంద్రం ఆయనకు Z ప్లస్ సెక్యురిటీ అందిస్తోంది. స్థానిక పోలీసులు కూడా భద్రత కల్పిస్తున్నారు.

అనంత్ అంబానీ పాదయాత్ర ఎందుకంటే...

ఏప్రిల్ 10 నాడు అనంత్ అంబానీ బర్త్ డే. ఈసారి ఆయన తన 30వ బర్త్ డే (Anant Ambani's 30th birthday) సెలబ్రేట్ చేసుకోనున్నారు. అందుకే ఆ ద్వారకాధీశుడి ఆశీస్సులు తీసుకునేందుకు ఆయన పాదయాత్రగా ద్వారకాకు వెళ్తున్నారు. 2025 లో అనంత్ అంబానీ ద్వారకలోని శ్రీకృష్ణుడి ఆలయం సందర్శించడం ఇది రెండోసారి. జనవరి ఆరంభంలోనే ముఖేష్ అంబానీ తన కుటుంబంతో కలిసి ద్వారకాదీశ్ ఆలయానికి వెళ్లారు.

అనంత్ అంబానీ ఇలా తనలోని భక్తి భావాన్ని చాటుకోవడం ఇదేం మొదటిసారి కాదు. 2024 జూన్‌లో రాధిక మర్చంట్‌తో (Anant Ambani's wife Radhika Merchant) పెళ్లికి ముందు కూడా ఆయన మహారాష్ట్రలోని నెరల్‌లో ఉన్న కృష్ణ కాళీ టెంపుల్‌కి వెళ్లి అక్కడ యజ్ఞం చేశారు. తన వైవాహిక జీవితానికి ఆశీర్వాదం కోరుతూ ఆయన ప్రత్యేక పూజలు చేశారు. 

Tags:    

Similar News