ఎన్నికల వేళ హీట్ పుట్టిస్తోన్న బెంగాల్ రాజకీయం

Update: 2020-12-18 15:30 GMT

ఎన్నికల వేళ టీఎంసీకి కొత్త చిక్కులు వచ్చిపడ్తున్నాయ్. ఒకరి తర్వాత ఒకరు.. పార్టీకి గుడ్ బై చెప్తున్నారు. ఇలాంటి సమయంలో రాష్ట్రంలో అమిత్ షా పర్యటన రాజకీయంగా ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇంతకీ ఆయన రాక తర్వాత బెంగాల్ రాజకీయం ఎలాంటి మలుపు తీసుకునే అవకాశం ఉంది. రానున్న రెండు రోజులు అక్కడ ఏం జరగనుంది.

ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. బెంగాల్‌లో రాజకీయాలు వేగంగా మారుతున్నాయ్. గెలుపే లక్ష్యంగా బీజేపీ అక్కడ వ్యూహాలు సిద్ధం చేస్తుండగా టీఎంసీ అలర్ట్ అయింది. ఇలాంటి తరుణంలో శనివారం అమిత్ షా బెంగాల్ పర్యటన మరింత హీట్ రాజేస్తోంది. సువేందు అధికారితో పాటు టీఎంసీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఇప్పటికే పార్టీని వీడారు. షా పర్యటనలో భాగంగా సువేందు కమలం కండువా కప్పుకుంటారన్న చర్చ జరుగుతోంది. ఆయనతో పాటు టీఎంసీ నుంచి ఇంకా బయటకు వచ్చేది ఎవరన్న ఆసక్తి రాజకీయవర్గాల్లో కనిపిస్తోంది. ఐపీఎస్ అధికారుల డిప్యుటేషన్ వ్యవహారంలో రగడ కొనసాగుతున్న వేళ అమిత్ షా పర్యటనకు వస్తుండడం ఆసక్తికరంగా మారింది.

రెండు రోజుల గ్యాప్‌లోనే ముగ్గురు ఎమ్మెల్యేలు టీఎంసీకి రాజీనామా చేశారు. ముందుగా సువేందు అధికారి గుడ్ బై చెప్పగా ఆ తర్వాత జితేంద్ర తివారీ, శీల్‌భద్ర దత్తాలు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. షా పర్యటనకు ముందు వీరంతా పార్టీని వీడడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. బెంగాల్‌లో అమిత్ షా పర్యటన రెండురోజులు సాగనుండగా తృణమూల్‌ నుంచి వలసలు భారీగానే ఉండే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం వినిపిస్తోంది.

రాష్ట్రంలో పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించడంతో పాటు నేతలకు కీలక సూచనలు చేసేందుకు అమిత్ షా రెండు రోజుల పర్యటనకు బెంగాల్ వస్తున్నారు. శని, ఆది వారాల్లో పలుప్రాంతాల్లో ఆయన రోడ్‌ షోలు నిర్వహించేందుకు రాష్ట్ర పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తోంది. శనివారం ఉదయం ఉత్తర కోల్‌కతాలోని స్వామి వివేకానందా భవనాన్ని సందర్శించిన తర్వాత అమిత్ షా మిద్నాపూర్‌కు బయల్దేరుతారు. అక్కడ ఓ రైతు ఇంట్లో బస చేసిన తర్వాత స్థానిక కాలేజీ గ్రౌండ్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఆదివారం రోడ్‌ షోలు నిర్వహించిన తర్వాత పార్టీ ముఖ్యులతో సమావేశం అవుతారు. 

Tags:    

Similar News