AAP MLA Amanatullah Khan: ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌ని అరెస్ట్ చేసిన ఈడి

Update: 2024-09-02 09:27 GMT

AAP MLA Amanatullah Khan Arrest: ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ వక్ఫ్ బోర్డ్‌లో నియామకాలతో పాటు వక్ఫ్ బోర్డుకి చెందిన రూ.100 కోట్ల ఆస్తులను లీజ్‌కి ఇచ్చే విషయంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అమానతుల్లా ఖాన్‌ని అదుపులోకి తీసుకున్నారు. అమానతుల్లా ఖాన్ అరెస్ట్ అనేక నాటకీయ పరిణామాల మధ్య చోటుచేసుకుంది. అరెస్ట్ కంటే ముందుగా అమానతుల్లా ఖాన్ నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.

ఈడీ సోదాలపై ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ తీవ్రంగా స్పందించారు. ఈడీ అధికారులు వ్యవహరించిన తీరు సరిగ్గా లేదని అన్నారు. నాలుగు రోజుల క్రితమే క్యాన్సర్ వ్యాధికి సర్జరీ చేసుకుని విశ్రాంతి తీసుకుంటున్న తన అత్త ఈడీ అధికారుల తీరుతో తీవ్ర ఇబ్బందికి గురైందని ఆయన ఆరోపించారు. సోదాల పేరుతో ఈడీ అధికారులు తనని అరెస్ట్ చేసేందుకే వచ్చారని అమానతుల్లా ఖాన్ ఆగ్రహం వ్యక్తంచేశారు.

గత రెండేళ్ల నుండి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు తనని తప్పుడు కేసులు పేరుతో వేధిస్తున్నారు. ఎన్నో సమస్యలు సృష్టిస్తున్నారు. తమ ఆప్ పార్టీని విచ్చిన్నం చేయడమే వారి లక్ష్యం. కానీ ఈడి బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు అని ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ స్పష్టంచేశారు. అంతేకాదు.. నియంతకు తిరుగుబాటుదారులు ఎన్నటికీ తలవంచరు అంటూ ఎక్స్ వేదికగా ఓ వీడియో పోస్ట్ చేశారు. 

ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ ఇంట్లో సోదాల సందర్భంగా కొన్ని దృశ్యాలు బయటికొచ్చాయి. అందులో ఖాన్ తన అత్తకు నాలుగు రోజుల క్రితమే సర్జరీ అయిందని.. తనకు నాలుగు వారాల సమయం ఇవ్వండని కోరడం కనిపించింది. అదే సమయంలో ఆ వీడియోలో ఉన్న అధికారి ఖాన్ కి జవాబు ఇస్తూ.. మేము మిమ్మల్ని అరెస్ట్ చేయడం కోసమే వచ్చాం అని ఎలా అనుకుంటావు అని ప్రశ్నించారు. సదరు అధికారి అడిగిన ప్రశ్నకు ఖాన్ సైతం అంతే తీవ్రంగా స్పందిస్తూ.. తనని అరెస్ట్ చేయడానికి కాకపోతే మరెందుకు వచ్చినట్లు అంటూ మండిపడటం ఆ దృశ్యాల్లో కనిపించింది. మరోవైపు ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ భార్య సైతం స్పందిస్తూ... తన తల్లికి ఏదైనా అయితే మిమ్మల్ని కోర్టుకు ఈడుస్తాను అంటూ హెచ్చరించడం కూడా ఆ వీడియోల్లో కనిపించింది. 

ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఆప్ కన్వివర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం జైలులో ఉన్నారు. అంతకంటే ముందుగా అరెస్ట్ అయిన ఆప్ అగ్రనేత, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇటీవలే బెయిల్‌పై బయటికొచ్చారు. తాజాగా అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌ని ఈడీ అరెస్ట్ చేయడం రాజకీయవర్గాల్లో చర్చనియాంశమైంది.

Tags:    

Similar News