ఈమధ్యనే 'పడి పడి లేచే మనసు' అనే సినిమాతో డిజాస్టర్ అందుకున్న యువ హీరో శర్వానంద్ ప్రస్తుతం సుధీర్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రమోషన్ మెటీరియల్ గురించి పక్కన పెడితే ప్రేక్షకులను ముందుగా ఆకట్టుకునేది టైటిల్ అని చెప్పచ్చు. అందుకే చాలావరకు దర్శక నిర్మాతలు సినిమా టైటిల్ పై ఎక్కువ ఎక్కువ దృష్టి పెడుతుంటారు. అలాగే సుధీర్ వర్మ కూడా శర్వానంద్ సినిమా కోసం ఒక పవర్ ఫుల్ టైటిల్ ను కోసం వెతుకుతున్నారు అని తెలుస్తోంది. ఈ సినిమాలో శర్వానంద్ రెండు షేడ్స్ లో కనిపించనున్నాడు. ఒక గ్యాంగ్ స్టర్, మాఫియా డాన్ యాంగిల్ కూడా ఉండబోతోందని సమాచారం.
ఇప్పటికే కొన్ని టైటిల్స్ ను పరిశీలించారు కానీ అవి అంతా బాగోకపోవడంతో రిజిస్టర్ చేయించలేదు. మొదట్లో 'దళపతి' అనే టైటిల్ ను రిజిస్టర్ చేశారు కానీ ఆ తర్వాత ఈ సినిమాకు 'ఫ్యూహం' అనే టైటిల్ కూడా వినిపించింది. కానీ అది అందరికీ ఎక్కేలా లేదని 'పార్ధు' అనే టైటిల్ ను అనుకున్నారు. అయితే ఇప్పటికీ టైటిల్ పై చర్చ జరుగుతూనే ఉంది. అందరూ టైటిల్ గురించి ఒక నిర్ణయానికి రాగానే అధికారికంగా ప్రకటించనున్నారు. కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను సూర్యదేవర నాగ వంశీ సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ప్రశాంత్ పెళ్లై సంగీతం అందిస్తున్న ఈ సినిమా వేసవిలో విడుదల కానుంది.