వివాదాస్పద సినిమాలు తీయడంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ముందు ఉంటాడు అని తెలిసిన విషయమే. గత కొంతకాలంగా ఫ్లాపులతో సతమతమవుతున్న వర్మ ఈ మధ్యనే 'లక్ష్మీస్ ఎన్టీఆర్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నందమూరి తారకరామారావు గారి జీవిత చరిత్రగా తెరకెక్కిన ఈ సినిమా తెలంగాణ మరియు ఓవర్సీస్ లో ఎన్నికలకు ముందే విడుదలైనప్పటికీ ఈ సినిమా ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎన్నికల తరువాత కూడా విడుదలకు నోచుకోలేదు. ఈ సినిమా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి వ్యతిరేకంగా ఉందని ఈ సినిమా విడుదలను ఎన్నికలు పూర్తయ్యే వరకు వాయిదా వేయడం జరిగింది.
ఇక ఎన్నికలు పూర్తయిన తర్వాత ఈ సినిమా విడుదల అవుతుంది అనుకుంటుండగా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు మరో ఆటంకం ఎదురయింది. "లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా కి సెన్సార్ మరియు హైకోర్టు క్లియరెన్స్ వచ్చినప్పటికీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తాయేమోనని ఆంధ్రప్రదేశ్ లోని కొందరు అధికారులు సినిమాను థియేటర్ల నుంచి తీసేసారు. సినిమాను ఆపేసిన వారిని అసలు ఎలాంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తాయి అని అడుగుతున్నాను" అంటూ రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. మరి ఈ సినిమాకు ఆంధ్రప్రదేశ్ లో విడుదలయ్యే యోగం ఉందో లేదో చూడాలి.