ముగిసిన పూరీ జగన్నాథ్, చార్మి ఈడీ విచారణ
*లైగర్ సినిమాకు నగదు లావాదేవీలపై ఈడీ ఆరా
Puri And Charmy Enquiry: టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, నిర్మాత చార్మిలను ఈడీ విచారించింది. లైగర్ సినిమాకు నగదు లావాదేవీలపై ఈడీ ఆరా తీసింది. ఫెమా నిబంధనల ఉల్లంఘనలపై ప్రశ్నల వర్షం కురిపించింది. ఆధారాలు ముందు పెట్టి డైరెక్టర్, ప్రొడ్యూసర్‌లను ప్రశ్నించింది. ముందస్తుగా నోటీసులు ఇచ్చి ఈడీ ఆఫీసుకు పిలిపించి 9 గంటలపాటు విచారించారు.
సక్సెస్ ఫుల్ డైరెక్టర్‌గా దూసుకుపోయిన పూరీ.. మధ్యలో కొన్ని ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. అటు సినిమాలు ప్లాప్ కావటమే కాకుండా.. తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టించిన డ్రగ్స్ కేసు కూడా కొన్నాళ్లపాటు ఆయనను చాలా డిస్ట్రబ్ చేసింది. అయితే.. అందులో నుంచి తేరుకున్న పూరీ.. చార్మీతో కలిసి ఓ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశారు. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు పూరీ. ఆ తర్వాత
పాన్ ఇండియా మూవీతో ఇండస్ట్రీకి గట్టి హిట్ ఇవ్వాలనుకున్న పూరీ.. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో లైగర్ మూవీ తీశారు. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కించగా.. థియేటర్లలో కాసులు కురిపించటంలో మాత్రం ఈ పాన్ ఇండియా మూవీ నిరాశపర్చింది.
చర్చ అంతా ఇంత భారీ సినిమా తీసేందుకు పెట్టుబడులు ఎవరు పెట్టారనే అంశపై ఈడీ కన్నేసింది. ఈ సినిమాకు బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ అయిన కరణ్ జోహార్ కూడా ఓ చేయి వేయగా.. మిగత పెట్టుబడులు రాజకీయ నాయకులు పెట్టారనేది ఆరోపణ. ఆ మధ్య.. డిస్ట్రిబ్యూటర్ల దగ్గర నుంచి కూడా పూరీకి బెదిరింపు కాల్స్ రావటం.. దానికి పూరీ కూడా అంతే గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ.. పెట్టుబడుల విషయమై ఈడీ చార్మీ, పూరీ జగన్నాథ్‌లను సుధీర్ఘంగా విచారించి వివరాలు రాబట్టుకునే ప్రయత్నం చేసింది.