సంక్రాంతికి వస్తున్నారు.. డాకు మహారాజ్, గేమ్ ఛేంజర్..

2025 January Movies: 2025 ప్రేక్షకులను అలరించేందుకు పలు సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. అందులో భాగంగా జనవరిలో బాక్సాఫీసు ముందుకు రాబోతున్న చిత్రాలేంటో చూద్దాం.

Update: 2025-01-01 07:30 GMT

2025 January Movies: 2025 ప్రేక్షకులను అలరించేందుకు పలు సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. అందులో భాగంగా జనవరిలో బాక్సాఫీసు ముందుకు రాబోతున్న చిత్రాలేంటో చూద్దాం.

నూతన సంవత్సరం సందర్భంగా ఆడియన్స్‌ను అలరించేందుకు తొలివారం తెలుగు సినిమాలు ఏమీ రిలీజ్ కాలేదు. అనువాద చిత్రం మార్కో సందడి చేస్తోంది. ఉన్ని ముకుందన్ హీరోగా హానీష్ దర్శకత్వం వహించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇది. మలయాళంలో విడుదలైన ఈ సినిమా అక్కడ సూపర్ హిట్‌గా నిలిచింది. జనవరి 1న తెలుగు ప్రేక్షకుమల ముందుకొచ్చింది. టొవినో థామస్, త్రిష ప్రధాన పాత్రల్లో దర్శకులు అఖిల్ పాల్, అనాస్ ఖాన్ రూపొందించిన ఐడెంటిటీ మలయాళం, తమిళ్‌లో ఈ నెల 2న విడుదల కానుంది.

సంక్రాంతి బరిలో అగ్రహీరోలు బాలకృష్ణ, వెంకటేష్, రామ్ చరణ్‌ చిత్రాలతో బాక్సాఫీసు వద్ద పోటీ రసవత్తరంగా ఉండనుంది. రామ్ చరణ్ హీరోగా దర్శకుడు శంకర్ రూపొందించిన సినిమా గేమ్ ఛేంజర్. కియారా అద్వాణీ హీరోయిన్ గా.. శ్రీకాంత్, అంజలి, నవీన్ చంద్ర, ఎస్.జె సూర్య, సునీల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ నటించిన చిత్రంకావడం.. ద్విపాత్రాభినయంతో విభిన్న గెటప్పుల్లో కనిపించనుండడం ఇలా పలు అంశాల్లో గేమ్ ఛేంజర్ పై అంచనాలు భారీగా నెలకొన్నాయి. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా జనవరి 10న విడుదల కానుంది. సంక్రాంతి సీజన్‌లో ఈ సినిమా విడుదలకావడం ప్లస్ పాయింట్. మరి దాన్ని గేమ్ ఛేంజర్ ఎంత వరకు క్యాష్ చేస్తుందో చూడాలి మరి.

దర్శకుడు బాబీ ఈ ఏడాది సంక్రాంతికి డాకు మహారాజ్‌ను తీసుకురానున్నారు. బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న యాక్షన్ డ్రామా మూవీ. శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్లు. ఈ మూవీ జనవరి 12న రిలీజ్ అవుతుంది. డిఫరెంట్ లుక్‌లో బాలకృష్ణని పరిచయం చేసిన టీజర్ ఆడియన్స్‌లో సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. బాలకృష్ణకు సంక్రాంతి సెంటిమెంట్ ఉంది. అది ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి మరి.

టైటిల్‌తోనే ప్రత్యేకంగా ఆకర్షిస్తోంది సంక్రాంతికి వస్తున్నాం చిత్రం. వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లు. ఎఫ్2, ఎఫ్3 తర్వాత వెంకటేష్, అనిల్ కాంబినేషన్లో వస్తుండడంతో ఈ యాక్షన్ కామెడీ మూవీపై ప్రేక్షకుల్లో ప్రత్యేక దృష్టి నెలకొంది. ఈ సినిమా జనవరి 14న రిలీజ్ కానుంది.

స్వీయ దర్శకత్వంలో కంగనా రనౌత్ నటించిన ఎమర్జెన్సీ జనవరి 17న విడుదల కానుంది. సోనూసూద్ దర్శకత్వం వహిస్తూ హీరోగా నటించిన హిందీ చిత్రం ఫతేహ్ జనవరి 10న రిలీజ్ కానుంది. 77వ కేన్స్ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై విమర్శకుల ప్రశంసలు అందుకున్న సినిమా సంతోశ్. ఆస్కార్ షార్ట్ లిస్టులో యూకే నుంచి ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ విభాగంలో స్థానం దక్కించుకున్న ఈ సినిమా థియేటర్లలో జనవరి 10న విడుదల కానుంది. షహనా గోస్వామి ప్రధాన పాత్రలో సంధ్యా సూరి తెరకెక్కించారు.

జనవరి ఎండింగ్‌లో.. అక్షయ్ కుమార్ హీరోగా సందీప్ కేవ్లానీ, అభిషేక్ కపూర్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న చిత్ర స్కై ఫోర్స్. భారత్‌లో జరిగిన మొదటి వైమానిక దాడి ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని రిపబ్లిక్ డే సందర్భంగా ఈ నెల 24న విడుదల చేయనున్నారు. అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. సన్నీ దేవోల్, ప్రీతి జింటా ప్రధాన పాత్రల్లో రాజ్ కుమార్ సంతోషి తెరకెక్కిస్తున్న పీరియడ్ యాక్షన్ ఫిల్మ్ లాహోర్ 1947. ఈ సినిమాకు అమీర్ ఖాన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం గణతంత్ర దినోత్సవం సందర్భంగా రిలీజ్ కానుందని సమాచారం. షాహిద్ కపూర్ హీరోగా రోషన్ ఆండ్రూస్ తెరకెక్కిస్తున్న చిత్రం దేవ. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ జనవరి 31న విడుదలకు సిద్దమవుతోంది.

Tags:    

Similar News