Boney Kapoor: సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్‌ను నిందించాల్సిన అవసరం లేదు
Boney Kapoor: సంధ్య థియేటర్ ఘటనపై బాలీవుడ్ ప్రముఖ నిర్మాత బోనీకపూర్ స్పందించారు.
Boney Kapoor: సంధ్య థియేటర్ ఘటనపై బాలీవుడ్ ప్రముఖ నిర్మాత బోనీకపూర్ స్పందించారు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న బోనీకపూర్ జనాలు ఎక్కువ మంది రావడం వల్ల ఆ ఘటన జరిగిందన్నారు. ఇందులో అల్లు అర్జున్‌ను నిందించాల్సిన అవసరం లేదంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
దక్షిణాది ప్రేక్షకులు హీరోలను ఎక్కువ అభిమానిస్తారు. అజిత్ నటించిన ఓ సినిమాను చూసేందుకు అర్థరాత్రి షోకు వెళ్లాను. సుమారు 20 వేల మంది థియేటర్ దగ్గర ఉన్నారు. సినిమా హాలు వద్ద అంతమంది జనాలను చూడడం అదే మొదటిసారి అని చెప్పారు. సినిమా పూర్తయి బయటకు వచ్చే సరికి సమయం నాలుగు అయింది. అయినా థియేటర్ బయట చాలామంది అభిమానులు అలాగే ఎదురు చూస్తూ నిలబడ్డారు. రజనీకాంత్, చిరంజీవి, రామ్ చరణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి అగ్ర హీరోల సినిమాలకు అభిమానులు అలానే వస్తారని అన్నారు.
ఎక్కువ మంది జనాలు రావడం వల్లే ఆ ఘటన జరిగింది. ఇందులో అల్లు అర్జున్‌ను నిందించాల్సిన అవసరం లేదని బోనీకపూర్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. డిసెంబర్ 4న సంధ్య థియేటర్‌లో పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా అల్లు అర్జున్ సినిమా చూసేందుకు వెళ్లారు. ఆ సమయంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతిచెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేయడం, అరెస్ట్ చేయడం జరిగిపోయాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్‌పై ఉన్నారు. తొక్కిసలాట ఘటన తర్వాత అల్లు అర్జున్‌పై పలు విమర్శలు వచ్చాయి. ఆ దుర్ఘటన జరిగిన తరువాత కూడా అల్లు అర్జున్ వైఖరిలో మార్పురాలేదని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆరోపించడం సంచలనం సృష్టించింది.
ఇటీవల ఓ వెబ్‌సైట్ దక్షిణాదితో పాటు బాలీవుడ్‌కు చెందిన సినీ ప్రముఖులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. అందులో సిద్దార్థ్, నాగవంశీ, బోనీకపూర్‌తో పాటు మరికొందరు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోనీ కపూర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బోనీ కపూర్ కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.