A FILM BY RGV: వర్మ సినిమాలో హీరో కేసీఆర్ అయితే.. విలన్ ఎవరు..?
A FILM BY RGV: టిఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బయోపిక్ త్వరలో రాబోతుందా..?
A FILM BY RGV: టిఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బయోపిక్ త్వరలో రాబోతుందా..? అదికూడా సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అయిన రామ్ గోపాల్ వర్మనే తీయ బోతున్నారా..? స్క్రిప్ట్ సిద్ధమయ్యిందా..? అన్న ప్రశ్నలన్నింటికీ కొంచెం అటూ ఇటుగా అవుననే సమాధానాలే వస్తున్నాయి. రామ్ గోపాల్ వర్మ తీసిన ఒక సినిమా ట్రైలర్ ను ఢిల్లీలో విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో కేసీఆర్ బయోపిక్ ఎప్పుడు తీస్తున్నారు అని అడిగిన ప్రశ్నకు మొత్తానికి లేదు అనకుండా ఇప్పుడే కాదు అనడం చూస్తుంటే మరికొన్ని రోజుల్లో కేసీఆర్ బయోపిక్ రావడం ఖాయం అనిపిస్తోంది.
కేసీఆర్ బయోపిక్ పై రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆర్జీవీ అంటేనే సెన్సేషన్లకు అడ్రస్ అలాంటి డైరెక్టర్ చేతిలో ఒక ఉద్యమ నేత చరిత్ర ఎలా తెరకెక్కుతుంది.. ? కేసీఆర్ జీవిత చరిత్రను ఎక్కడి నుంచి తీసుకుంటారు..? విద్యార్థి దశ నుంచి తీసుకుంటారా..? రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఉంటుందా..? లేక పోతే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని భుజానికెత్తుకుని స్వరాష్ట్ర సాధన కలను నిజం చేసుకునేంత వరకు సాగుతుందా..? అక్కడితో ఆగకుండా బంగారు తెలంగాణ ఎలా ఉంటుంది అని వెండి తెరపై చూపించబోతున్నారా..? ఇలాంటి ఎన్నో ప్రశ్నల చుట్టూ చర్చ సాగుతోంది.
సినిమా అనగానే ఒక హీరో, విలన్ ఇతర పాత్రలూ ఉంటాయి. అయితే కేసీఆర్ బయోపిక్ అంటే కేసీఆరే హీరో మరి విలన్ పాత్రలో ఎవరిని చూపించ బోతున్నారు..? . ప్రస్తుత రాజకీయాల్లో కాంగ్రెస్, బిజెపి లను కేసీఆర్ ప్రత్యర్థి పార్టీలుగానే చూస్తున్నారు. ఈ రెండింటిలో ఎవరిని విలన్ గా చూపించబోతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ సహకరించింది బిజెపి. ఈ యాంగిల్ లో రెండు పార్టీలను విలన్ పాత్రలో చూపించ లేరు. ఉద్యమ సమయంలో విలన్ కాకపోయినా బంగారు తెలంగాణ ఏర్పాటులో బిజెపి మోకాలడ్డుతోందని విలన్ గా చూపిస్తారా..? లేకపోతే ఉద్యమ సమయంలో వందల మంది విద్యార్థుల మరణాలకు కారణం ఎవరిని చూపిస్తారు..? అదీ కాకపోతే మానిన గాయాలను మళ్లీ కెలికి వివాదాల తేనె తుట్టెను ఎందుకు కదిలించడం ఎందుకనుకుంటారా..? ఇవన్నీ లేకుండా తీసే సినిమా వెండి తెరపై పండుతుందా..? అన్న ప్రశ్నలన్నింటికి వర్మ ఎలాంటి సమాధానం చెప్పబోతున్నారన్నదే ఇప్పుడు ఉత్కంఠగా మారింది.