పాత్ర బాగుండటంతో రిస్క్ తీసుకోవాల్సి వచ్చింది అని చెబుతున్న శ్రద్ధ శ్రీనాథ్
కన్నడ 'యూటర్న్' సినిమాతో పాప్యులర్ అయిన శ్రద్ధా శ్రీనాధ్ ఇప్పటికే తమిళ, కన్నడ భాషల్లో మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రాబోతున్న 'జెర్సీ' సినిమాలో హీరోయిన్ గా నటిస్తూ తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం కాబోతోంది. తెలుగమ్మాయి లాగానే తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు అని ప్రశ్నించగా, "నా స్కూలింగ్ మొత్తం సికింద్రాబాద్ లోనే జరిగింది. స్వస్థలం బెంగుళూరు అయినప్పటికీ నాన్నగారు ఆర్మీ లో పనిచేసేవారు కాబట్టి ఉద్యోగరీత్యా నా బాల్యం ఆరేళ్లపాటు సికింద్రాబాద్ లోనే గడిచింది. అందుకే నాకు తెలుగు బాగానే అర్థం అవుతుంది" అని చెప్పుకొచ్చింది శ్రద్ధ శ్రీనాథ్.
'జెర్సీ' సినిమాకంటే ముందే 2017 లో ఆది సాయి కుమార్ తో 'జోడి' అనే సినిమాలో మరియు సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై క్షణం రవికాంత్ దర్శకత్వంలో ఒక సినిమా సైన్ చేసింది శ్రద్ధ. కానీ ఆ సినిమాలు ఆలస్యం కావడంతో 'జెర్సీ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి మొదటి సినిమాలోనే తల్లి పాత్ర లో కనిపించడం రిస్క్ అనిపించలేదా అని అడిగితే ఒకరకంగా రిస్క్ కానీ ఈ సినిమాలో తన పాత్ర చాలా కొత్తగా ఉంటుందని, సినిమాలో చక్కని ఎమోషన్స్ తో పాటు భావోద్వేగాలను పండించగల అవకాశం వచ్చింది కాబట్టి ఈ పాత్ర తనకు చాలా ఆనందాన్ని కలిగించిందని, అంతేకాక ఒకే సినిమాలో టీనేజ్ అమ్మాయిగా, అలాగే తల్లిగా కనిపించటం ఆసక్తికరంగా ఉంటుందని చెప్పింది శ్రద్ధ.