IC 814: The Kandahar Hijack: నెట్‌ఫ్లిక్స్‌లో ఈ వెబ్ సిరీస్‌ను బ్యాన్ చేయాలనే ఆరోపణలు ఎందుకు వచ్చాయి? అసలేమిటీ వివాదం?
1999 డిసెంబర్ 24 నాటి కాందహార్ విమానం హైజాక్ రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన ‘ఐసి 814: ద కాందహార్ హైజాక్’ వెబ్ సిరీస్ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. కాందహార్ విమానాన్ని హైజాక్ చేసిన ఉగ్రవాదులు పాకిస్థాన్‌కి చెందిన ఇస్లాం మతస్థులు కాగా, ఈ వెబ్ సిరీస్‌లో మాత్రం విమానం హైజాక్‌కి పాల్పడిన ఉగ్రవాదులకు హిందువుల పేర్లు పెట్టడం ఏంటని బీజేపి నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. "ఇలా హిందువుల పేర్లు పెట్టడం వల్ల విమానం హైజాక్‌కి పాల్పడింది హిందువులే అనే తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉంది" అని బీజేపీ నేత అమిత్ మాలవీయ అభ్యంతరం వ్యక్తంచేశారు.
సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోసిన నెటిజెన్స్..
సోషల్ మీడియాలోనూ ఈ అంశంపై ఐసి 814: ద కాందహార్ హైజాక్ వెబ్ సిరీస్ డైరెక్టర్ అనుభవ్ సిన్హాపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఇండియాలో ఈ వెబ్ సిరీస్‌ని నిషేధించాలి అనే డిమాండ్ కూడా వినిపించింది. ఈ వెబ్ సిరీస్‌ను నిషేధించాలనే క్యాంపెయిన్‌కి సోషల్ మీడియాలో భారీ మద్దతు లభించింది. దీంతో మొత్తానికి ఈ వివాదం కేంద్రం వరకు వెళ్లింది.
వివాదంపై స్పందించిన కేంద్రం..
ఐసి 814: ద కాందహార్ హైజాక్ వెబ్ సిరీస్ వివాదంపై స్పందించిన కేంద్రం.. నెట్‌ఫ్లిక్స్ ఇండియా కంటెండ్ హెడ్ మోనిక షెర్గిల్ నుండి వివరణ కోరింది.
దిగొచ్చిన నెట్‌ఫ్లిక్స్
కేంద్రం జోక్యంతో ఈ వివాదంపై స్పందించిన నెట్‌ఫ్లిక్స్ ఇండియా కంటెండ్ హెడ్ మోనిక షెర్గిల్.. నేటి నుండే (మంగళవారం) వెబ్ సిరీస్ ఆరంభంలో ఒక డిస్‌క్లేమర్ ప్లే చేయనున్నట్లు స్పష్టంచేశారు. విమానం హైజాక్‌కు పాల్పడిన ఉగ్రవాదుల అసలు పేర్లు, వారి అసలు పేర్లకు పక్కనే వెబ్ సిరీస్‌లో ఉపయోగించిన కోడ్ నేమ్స్‌ని ఈ డిస్‌క్లెయిమర్ ద్వారా వెల్లడించనున్నట్టు నెట్‌ఫ్లిక్స్ ఇండియా కంటెండ్ హెడ్ చెప్పారు.
ఉగ్రవాదులకు అసలు పేర్లు కాకుండా హిందువుల పేర్లు ఎందుకు పెట్టారు?
కాందహార్ విమానం హైజాక్‌కు పాల్పడింది ఇస్లాం మతానికి చెందిన ఉగ్రవాదులేనని రికార్డులో ఉంది. ఈ వెబ్ సిరీస్‌లో కూడా హైజాకర్లు తమను తాము పాకిస్తాన్ వాళ్ళుగా చెప్పుకుంటారు. ఇస్లాం మతం గురించి, మానవత్వం గురించి ఇస్లాం చెప్పిన నిర్వచానల గురించి కూడా ఇందులో సంభాషణలు ఉన్నాయి. అయితే, ఈ హైజాక్‌కు పాల్పడినప్పుడు వారు తమ ఐడెంటీటీ బహిర్గతం కాకుండా ఉండటం కోసం పేర్లు మార్చుకున్నారు. కోడ్ నేమ్స్ పెట్టుకున్నారు. ఈ వెబ్ సిరీస్‌లో కూడా ఆ పాత్రలను ఆ కోడ్ నేమ్స్ తనే వ్యహరించామని నెట్‌ఫ్లిక్స్ చెబుతోంది. ఏదేమైనా బాయ్‌కాట్ బాలీవుడ్ పేరుతో సోషల్ మీడియాలో క్యాంపెయిన్ ఊపందుకోవడంతో నెట్‌ఫ్లిక్స్ ఇండియా వెనక్కి తగ్గక తప్పలేదు.
ప్లేన్ హైజాక్ అయిన రోజు ఏం జరిగింది ?
అది డిసెంబర్ 24, 1999. నేపాల్ రాజధాని కాఠ్మాండూ నుంచి 154 మంది ప్రయాణికులు ప్లస్ విమాన సిబ్బందితో ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానం IC 814 ఢిల్లీకి బయల్దేరింది.
కాఠ్మాండూ నుండి ఢిల్లీకి విమానం ప్రయాణం సమయం 1 గంట 15 నిమిషాలు.
కాఠ్మాండూలో ఢిల్లీ విమానం టేకాఫ్ అయిన 40 నిమిషాల తరువాత ప్రయాణం మధ్యలో ఉండగా విమానంలో ఉన్నట్లుండి ఏదో అలజడి... ప్రయాణికుల్లోంచి పైకి లేచి నిలబడిన ఐదుగురు వ్యక్తులు విమానాన్ని హైజాక్ చేసినట్లు ప్రకటించారు. తమని తాము పాకిస్థాన్‌లోని హర్కత్-ఉల్-ముజహిదీన్ సంస్థకి చెందిన ఉగ్రవాదులుగా చెప్పుకుంటూ ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేశారు. ప్రస్తుతం విమానం తమ కంట్రోల్లో ఉందని చెప్పి భారత ప్రభుత్వానికి ప్లేన్ హైజాక్ సందేశాన్ని పంపించారు. ఢిల్లీకి చేరుకోవాల్సిన విమానాన్ని ఆఫ్గనిస్థాన్‌లోని కాందహార్‌కి డైవర్ట్ చేశారు. అప్పటికి ఆఫ్గనిస్థాన్ తాలిబాన్ల ఆధీనంలో ఉండటంతో విమానంలో ప్రయాణికులను బంధీలుగా చేసుకుని తమ డిమాండ్స్ సాధించుకోవచ్చనేది సదరు ఉగ్రవాదుల స్కెచ్.
ప్లేన్ హైజాక్ చేసిన ఉగ్రవాదుల డిమాండ్స్ ?
భారత ప్రభుత్వం పట్టుకున్న అత్యంత కరడుగట్టిన ఉగ్రవాదులైన మౌలానా మసూద్ అజార్, అహ్మద్ ఒమర్ సయీద్ షేక్, ముస్తాక్ అహ్మద్ జర్గర్‌లని విడిచిపెడితేనే విమానంలో ఉన్న వాళ్లు ప్రాణాలతో ఉంటారు అని హైజాకర్స్ బెదిరింపులకు పాల్పడ్డారు. 8 రోజులపాటు ఈ హైజాక్ డ్రామా కొనసాగింది.
భారత ప్రభుత్వంపై పెరిగిన ఒత్తిడి
విమానంలో బంధీలుగా ఉన్న 154 మంది ప్రయాణికులు, విమానం సిబ్బందిని ప్రాణాలతో సురక్షితంగా భారత్‌కి తీసుకురావాల్సిన బాధ్యత భారత ప్రభుత్వంపై ఉంది. దీంతో భారత ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. 8 రోజుల తరువాత చివరకు ఉగ్రవాదుల షరతులకు అంగీకరిస్తూ నిర్ణయం తీసుకోకతప్పలేదు. అప్పటి విదేశాంగ శాఖ మంత్రి జశ్వంత్ సింగ్ స్వయంగా ఈ ముగ్గురు కరడుగట్టిన ఉగ్రవాదులను తీసుకుని ప్రత్యేక విమానంలో కాందహార్ వెళ్లారు.
హైజాక్ కుట్ర వెనుకున్నదెవరు ?
పాకిస్థాన్ ఐఎస్ఐ ప్రమేయంతో, స్లీపర్ సెల్స్ సహాయంతో ఉగ్రవాదులు విమానం హైజాక్‌కి పాల్పడినట్లుగా అప్పట్లో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రకటించింది. సున్ని అహ్మెద్ ఖాజీ, షాకీర్ అక రాజేశ్ గోపాల్ వర్మ, మిస్త్రీ జహూర్ ఇబ్రహీం, షాహీద్ అఖ్తర్ సయీద్, ఇబ్రహీం అఖ్తర్‌లు ఈ హైజాక్‌కి పాల్పడ్డారు.
ఇదే రియల్ స్టోరీని కథాంశంగా తీసుకుని డైరెక్టర్ అనుభవ్ సిన్హా ఐసి 814: ద కాందహార్ హైజాక్ వెబ్ సిరీస్ తెరకెక్కించారు. విజయ్ వర్మ, నసీరుద్దీన్ షా, పంకజ్ కపూర్, దియా మీర్జ, అరవింద్ స్వామి, మనోజ్ పహ్వా, కుముద్ మిశ్రా తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.
మొత్తానికి హైజాక్‌కి పాల్పడిన ఉగ్రవాదులకు కోడ్ నేమ్స్ మాత్రమే చూపించి, అసలు పేర్లు చెప్పకపోవడం ఏమిటనే వివాదానికి నెట్ ఫ్లిక్స్ తెరదించింది. తీవ్రవాదుల అసలు పేర్లను చూపించడానికి అంగీకరిస్తున్నట్లు ప్రకటించింది.