Kangana Ranaut emergency movie releasing date: కంగనా రనౌత్... సినిమాల కంటే ఎక్కువగా కాంట్రవర్సీల ద్వారానే ఆమె పాపులారిటీ సంపాదించుకున్నారు. ఒకవైపు కాంట్రవర్సీలలో నిలుస్తూనే మరోవైపు సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. కంగనా నటించిన ఎమర్జెన్సీ చిత్రం ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. ఎట్టకేలకు ఈ సినిమాకు విముక్తి లభించింది. వచ్చే ఏడాది జనవరి 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుందని మేకర్స్ పోస్టర్ విడుదల చేశారు.
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ దర్శకత్వం వహించి నటించిన సినిమా ఎమర్జెన్సీ. ఈ సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి వివాదాలు చుట్టుముట్టాయి. చిత్రీకరణ పూర్తై ఏడాది అయింది.కంగనా ఎన్నికల బిజీలో ఉండడంతో ఓసారి.. సన్నివేశాల అభ్యంతరాలతో మరోసారి, సెన్సార్ విషయం ఇలా పలు కారణాలతో ఇప్పటికే వాయిదా పడుతూ వచ్చింది. ఈ చిత్రంలో తమని తక్కువ చేసి చూపించారని.. విడుదలను అడ్డుకోవాలని ఒక వర్గం మధ్యప్రదేశ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.
ఈ విషయమై విచారణ జరిపిన కోర్టు.. వారి వాదనలను పరిగణలోకి తీసుకోవాలని సెన్సార్ బోర్డుకు సూచించింది. దీంతో సెన్సార్ బోర్డు పలు సూచనలు చేసింది. దీనికి నిర్మాణ సంస్థ అంగీకరించింది. దీంతో ఈ సినిమా విడుదలకు అడ్డంకులు తొలిగాయి. భారతదేశంలో శక్తివంతమైన మహిళ చరిత్ర మీ ముందుకు రానుందంటూ కంగనా ఓ పోస్టర్ విడుదల చేశారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రాజకీయ జీవితం ఆధారంగా ఎమర్జెన్సీ చిత్రం తెరకెక్కింది. భారతదేశంలో చీకటి రోజులుగా పిలిచే ఎమర్జెన్సీ నాటి పరిస్థితులను ఈ చిత్రంలో చూపించారు. ఇందులో కంగనా.. ఇందిరా గాంధీ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ఆమె నిర్మాతగా వ్యవహరించారు. అనుపమ్ ఖేర్, మహిమా చౌదరి కీలక పాత్రలు పోషించారు.
1975లో దివంగత ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ సమయంలో జరిగిన కొన్ని వాస్తవిక సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ జీ5తో కలిసి ఈ సినిమాను ఆమె నిర్మించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్ నుంచి ఆమె బీజేపీ నుంచి ఎంపీగా గెలిచారు. ఈ సినిమాలో ఇందిరా గాంధీని అవమానించే విధంగా సన్నివేశాలు ఉంటే సహించేది లేదంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఇప్పటికే పలు విషయాల్లో ఈ చిత్రం సమస్యలు ఎదుర్కొందని కంగనా రనౌత్ ఆరోపించారు. అయితే సినిమా విడుదలైన తర్వాత మరెన్ని విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందోనని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.