ముదురుతున్న 'దిశ' వివాదం.. ఆగేది లేదంటున్న ఆర్జీవీ..నట్టి కుమార్!

ఒక పక్క ఆర్జీవీ తీస్తున్న దిశ సినిమా పై వివాదం ముదురుతోంది. మరో పక్క సినిమాలో వివాదాస్పద అంశాలు లేవనీ..సినిమా విడుదల చేసి తీరతామనీ ఇటు వర్మ..అటు నిర్మాత నట్టికుమార్ చెబుతూ వస్తున్నారు.

Update: 2020-11-03 06:55 GMT

యధార్థ సంఘటనలను సినిమాలుగా మల్చడంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూటే వేరు. ఆయన తీసే సినిమాలు ఎంత ఆసక్తికరంగా ఉంటాయో అంతే వివాదాల్లో చిక్కుకుంటాయి. దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం, హత్య, నిందితుల ఎన్ కౌంటర్ కథను ఆధారంగా చేసుకుని నిర్మిస్తున్న 'దిశ' చిత్రాన్ని నిలిపివేయాలని నిందితుల కుటుంబ సభ్యులు జ్యుడీషియల్ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. కొడుకులను పోగొట్టుకుని పుట్టెటు దుఃఖంలో ఉన్నామని ఈ చిత్రాన్ని తీసి మరింత మనోవేదనకు గురిచేస్తున్నారన్నారు. సినిమాను ఆపకపోతే హైకోర్టు సాక్షిగా ఆత్మహత్య చేసుకుంటామని నిందితుల కుటుంబ సభ్యులు ఆర్జీవీని హెచ్చరించారు.

వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో వివాదంలో చిక్కుకున్నారు. దిశను అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన యావత్తు దేశాన్ని కనీళ్ళు పెట్టించింది. ఆ ఘటన ఆధారంగా దిశ ఎన్‌కౌంటర్ పేరుతో ఓ చిత్రాన్ని నిర్మించి, విడుదలకు సిద్ధం చేశారు వర్మ. దాంతో సినిమాను ఆపేయాలంటూ సుప్రీంకోర్టు జ్యుడీషియల్ కమిషన్‌ను ఆశ్రయించారు దిశ నిందితుల కుటుంబ సభ్యులు. దిశ ఎన్ కౌంటర్ చిత్రాన్ని నిలిపేయాలంటూ ఆర్జీవీ ఆఫీస్‌ ముందు ఆందోళన చేశారు.

ఇదిలా ఉంటే ఈ సినిమాను ఆపాలంటూ ఇప్పటికే దిశ తండ్రి శ్రీధర్ రెడ్డి కూడా హైకోర్టును కోరాడు. ఇప్పుడు ఈ కేసులో ఎన్‌కౌంటర్‌కు గురైన ప్రధాన నిందితులు జొళ్లు శివ, జొళ్ళు నవీన్, చెన్నకేశవులు, మహమ్మద్ ఆరీఫ్ కుటుంబ సభ్యులు హై కోర్టు తలుపుతట్టారు. కుటుంబ సభ్యులతో పాటు పెరుగుతున్న పిల్లలపై ఈ చిత్రం తీవ్ర ప్రభావం పడుతుందని ఫిర్యాదు చేసారు. చనిపోయిన వాళ్లను ఈ చిత్రం తీసి ఇంకా చంపుతున్నారని కమిషన్‌కు తెలిపారు దిశ నిందితుల కుటుంబ సభ్యులు.

సుప్రీంకోర్టు నియమించిన కమీషన్‌కు విరుద్ధంగా చిత్రాన్ని నిర్మిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఒక పక్క ఎంక్వయిరీ కొనసాగుతుంటే దిశ కథను ఎలా తెరకెక్కిస్తారని ప్రశ్నిస్తున్నారు. వెంటనే రామ్ గోపాల్ తీస్తున్న చిత్రాన్ని నిలిపేయాలని కమిషన్‌ను కోరారు కుటుంబ సభ్యులు. న్యాయవాదుల సమక్షంలో కమిషన్ కు ఫిర్యాదు చేసారు. విచారణ కొనసాగుతుండగా దిశ కథను ఎలా తెరకెక్కిస్తారని కుటుంబ సభ్యుల తరుపు న్యాయవాది వర్మను ప్రశ్నించారు.

ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన చెన్నకేశవులు భార్య, వర్మ తనతో ఇంటర్వ్యూ చేసిన సమయంలో చెన్నకేశవులు గురించి, అతని కుటుంబం, తన కుటుంబం గురించి పూర్తి వివరాలు తీసుకున్నారని చెప్పుకొచ్చారు. అయితే ఏ రోజు కూడా దిశ సినిమా తీస్తానని తనకు చెప్పలేదన్నారామె. దిశ సినిమాలో తమ కుటుంబ సభ్యులను మరోసారి విలన్స్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఈ చిత్రం విడుదల చేస్తే తమ నాలుగు కుటుంబాలు హైకోర్టు సాక్షిగా ఆత్మహత్య చేసుకుంటాం అని తెలిపారు.

ఈనెల 26వ తేదీన దిశ సినిమాను విడుదల చేస్తామని డైరెక్టర్ రాంగోపాల్ వర్మ, నిర్మాత నట్టి కుమార్ చెబుతున్నారు. ఎవరిని ఎక్కడ కించపరిచేలాగా సినిమా తీయడం లేదని, మరోసారి ఇలా అమ్మాయిల పై అఘాయిత్యాలకు పాల్పడకుండా ఉండేలా ఈ సినిమా ఓ గుణపాఠం లాగా ఉంటుందని తెలిపారు. మరి వీళ్ళ అభ్యర్ధనను హై కోర్టు పరిగణనలోకి తీసుకుంటుందా మరోవైపు వర్మ ఈ సినిమాను ఆపేస్తాడా..? ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసి విడుదలకు కూడా సిద్ధం చేస్తున్నాడు. ట్రైలర్ కూడా విడుదలైంది. చూడాలిక చివరికి ఏం జరుగుతుందో..?

Tags:    

Similar News