Kalki 2898 AD: కల్కిలో నటించమనగానే వర్మ రియాక్షన్ ఇదే: నాగ అశ్విన్
Kalki 2898 AD: కల్కి సినిమా రికార్డుల సునామి సృష్టిస్తోంది. రూ. వెయ్యి కోట్ల వసూళ్ల దిశగా వేగంగా అడుగులు వేస్తోంది.
Nag Ashwin: కల్కి సినిమా రికార్డుల సునామి సృష్టిస్తోంది. రూ. వెయ్యి కోట్ల వసూళ్ల దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. గతంలో ఉన్న అన్ని రికార్డులను తిరగరాస్తూ ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా సినిమా దర్శకుడు నాగ అశ్విన్ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
కల్కి చిత్రంలో ప్రభాస్, అమితాబ్, కమల్, దీపికాతో పాటు మరికొందరు అగ్ర నటీనటులు కనిపించారు. వీరితో పాటు దర్శకులు రాజమౌళి, రామ్‌గోపాల్ వర్మ సైతం నటించారు. దీనిపై నాగ అశ్విన్ మాట్లాడారు. భారతీయ సినిమా నడకను మార్చిన దర్శకులు ఆర్జీవీ, రాజమౌళిలను డైరెక్ట్ చేయడం గొప్ప అనుభూతిని ఇచ్చిందన్న నాగీ.. అర్జీవీని సినిమాలో నటించమని అడిగినప్పుడు.. ‘నేనెందుకు?’ అనడిగారంటా. అయితే దీనికి నాగ్ అశ్వీన్ బదులిస్తూ ‘కలియుగంలో మీరుండాలి’ అని చెప్పినట్లు నవ్వుతూ బదులిచ్చారు.
ఇక కల్కి సినిమా తీసినందుకు తాను దర్శకుడిగా గర్విస్తున్నానని తెలిపాడు. నిజానికి కల్కిని మొదట ఒక సినిమాగానే అనుకున్నారంటా. కానీ కొన్ని షెడ్యూల్స్ అయ్యాక ఈ కథను రెండు గంటల్లో చెప్పలేం అనిపించిందని, అందుకే పార్టులుగా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇక పార్ట్- 2కి సంబంధించి ఇప్పటికే 20రోజుల షూటింగ్ పూర్తయిందన్న నాగీ.. ఇంకా యాక్షన్, బ్యాక్ స్టోరీస్ ఇలా చాలా చేయాలన్నారు. కల్కి2తో ప్రేక్షకులకు కొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నట్లు తెలిపారు. ఇంత భారీ సినిమా రావడానికి నిర్మాతలే కారణమన్న నాగ్ అశ్వీన్.. కథకు న్యాయం చేయడానికి ఎంత ఖర్చుకైనా వారు వెనకాడలేదన్నారు.
ఇక పార్ట్ 2లో ప్రభాస్ పాత్ర మరింత హైలెట్ అవుతుందని, అలాగే అమితాబ్, కమల్ పాత్రలు నెక్ట్స్ లెవల్లో ఉంటాయని చెప్పుకొచ్చాడు. యాస్కిన్ ఫిలాసఫీ ప్రపంచానికి తెలియజెప్పడానికే శ్రీశ్రీ మహాప్రస్థానంలోని లైన్స్ చెప్పించామని నాగీ చెప్పుకొచ్చారు. ఇక 50 ఏళ్ల వైజయంతీ సంస్థలో కల్కి అత్యంత బడ్జెట్ మూవీల్లో ఒకటని, పెట్టిన పెట్టుబడి మొత్తం తిరిగి రావడంతో కొండంత భారం దిగినట్టనిపించిందని నాగ అశ్వీన్ తెలిపాడు.