'మనం' సినిమా సూపర్ హిట్ అయినప్పటికీ విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహించిన '24' మరియు 'హలో' సినిమాలు ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. భారీ ఎత్తున ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు నమోదు చేసుకోలేకపోయాయి. అయినప్పటికీ విక్రమ్ కుమార్ తన తదుపరి సినిమా కోసం కూడా భారీ బడ్జెట్ ను అడుగుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం నాని హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. రొమాంటిక్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా లో నాని 5 హీరోయిన్లతో రొమాన్స్ చేయనున్నాడు.
అయితే దర్శకుడు విక్రమ్ కుమార్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించాలనుకుంటున్నారు. దానికోసం 50 కోట్ల బడ్జెట్ ను అడుగుతున్నాడని తెలుస్తోంది. అయితే నాని మార్కెట్ కంటే కూడా ఈ బడ్జెట్ ఎక్కువనే చెప్పాలి. పైగా నాని ముందు సినిమాలు 'కృష్ణార్జున యుద్ధం', 'దేవదాస్' కూడా ఫ్లాప్ అయ్యాయి. రెండు సినిమాలు కనీసం 25 కోట్ల మార్క్ కూడా దాటలేదు. మరోవైపు విక్రమ్ ట్రాక్ రికార్డు కూడా ఏమంత బాగాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్లిద్దరిపై 50 కోట్లు పెట్టడం అంటే ప్రొడ్యూసర్ కి చాలా పెద్ద రిస్క్ అని చెప్పుకోవచ్చు. మరి రిస్క్ తీసుకోవడం వల్ల ఫలితాలు ఎలా ఉంటాయో తెలియాలంటే వేచి చూడాల్సిందే.