అభిమానులకు చాలా దగ్గరగా ఉంటూ, వారిపై ఎప్పుడూ ప్రేమ చూపిస్తూ ఉండే హీరోలలో మెగాస్టార్ చిరంజీవి పేరు ముందే వస్తుంది. ఎవరైనా ప్యాన్ ఇబ్బందుల్లో ఉన్నా వెంటనే వెళ్లి వారికి సాయం అందించే గొప్ప మనస్సున్న హీరో కాబట్టే మెగాస్టార్ అయ్యారు అనడం అతిశయోక్తి కాదు. తాజాగా మరోసారి చిరంజీవి తన మంచితనం చాటుకున్నారు చిరు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన నక్కా వెంకటేశ్వరరావు అనే అభిమానికి కొడుకు పుడితే ఆ బాబుకు నామకరణం చేశారు చిరు. అభిమానిని స్వయంగా చిరు ఇంటికి పిలిపించుకుని ఆ బాబుకి పవన్ శంకర్ అని పేరు పెట్టి ఆశీర్వదించాడు.
నిజానికి చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు నక్కా వెంకటేశ్వరరావు తన సొంత గ్రామం అయిన తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం, మందపల్లి గ్రామంలో పార్టీ నిర్మాణం లో క్రియాశీలకంగా వ్యవహరించాడు. అప్పుడు గ్రామస్థులు వెంకటేశ్వరరావును రాజకీయంగా వెలి వేశారు కూడా. ప్రజారాజ్యంకు మద్దతు పలికినందుకు అతడిని బహిష్కరించారు. ఆ సమయంలో చిరు తనకు తోడుగా ఉంటానని హామీ ఇచ్చారు. తాజాగా వెంకటేశ్వరావుకు కొడుకు పుట్టాడు. ఎన్ని సంవత్సరాలు అయినా తన కొడుక్కి చిరంజీవి గారే నామకరణం చేయాలంటూ సంవత్సరం నుండి పిల్లాడికి పేరు పెట్టకుండా ఉన్నాడు. ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి వెంకటేశ్వరరావును కుటుంబ సభ్యులతో సహా ఇంటికి రమ్మని పిల్లాడికి తన తమ్ముడు పేరు వచ్చేలా పవన్ శంకర్ అని పెట్టారు.