టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ఒకరిని చూసి అసూయ పడుతున్నారట. ఈ విషయాన్ని తానే స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అల్లు అర్జున్ అసూయ పడుతుంది ఎవరిని చూసో కాదు తన సొంత కొడుకుని చూసి. ఈ మధ్యనే అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్ తన పుట్టిన రోజును జరుపుకున్నాడు. ఈ సందర్భంగా బన్నీ తండ్రి అల్లు అరవింద్ అయాన్ కి ఇచ్చిన పుట్టినరోజు బహుమతి చూసి అల్లు అర్జున్ కి అసూయ కలిగిందట. అల్లు అయాన్ పుట్టినరోజు సందర్భంగా అల్లు అరవింద్ తన మనవడి కోసం ఏకంగా ఒక స్విమ్మింగ్ పూల్ గిఫ్ట్ గా ఇచ్చారట.
"మా నాన్నగారు అల్లు అయాన్ పుట్టినరోజు కి బహుమతిగా స్విమ్మింగ్ పూల్ ని ఇచ్చారు. నేను ఇంకా షాక్ లోనే ఉన్నాను. కేవలం 45 రోజుల ముందే ఆయన అయాన్ ను ఏం కావాలని అడగగా పూల్ కావాలని అడిగాడు. మా నాన్నగారు వెంటనే కొని డెలివరీ పంపించారు. అలాంటి తాతగారు దొరకడం నిజంగా అయాన్ అదృష్టం. ఈ నాలుగవ జనరేషన్ పిల్లలు చాలా అదృష్టవంతులు. నాకు వాళ్ళని చూస్తే అసూయగా ఉంది. మేము ఈ పూల్ కి 'అల్లు పూల్' అనే పేరు పెట్టాం" అని సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో పంచుకున్నాడు స్టైలిష్ స్టార్. పోస్ట్ తో పాటే కొన్ని ఫోటోలు కూడా షేర్ చేశాడు బన్నీ. ఆ ఫోటో లో అయాన్, బన్నీ కూతురు అర్హ, మరియు బన్నీ మేనకోడలు అన్విత పూల్ లో ఆడుకుంటూ కనిపించారు.