'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమా తర్వాత ఏకంగా ఏడాది గ్యాప్ తీసుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎట్టకేలకు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక సంవత్సరంపాటు ఫాన్స్ కు దూరంగా ఉన్న బన్నీ ఇప్పుడు వరుస పెట్టి సినిమాలను లైన్లో పెడుతున్నాడు. తాజాగా సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా తర్వాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఒక సినిమా లో కనిపించబోతున్నాడు. రోడ్ జర్నీ బ్యాక్ డ్రాప్ తో సాగే సినిమా అని తెలుస్తోంది. అయితే ఈ సినిమా గురించి ఒక వార్త ఇప్పుడు బన్నీ ఫాన్స్ లో కలవరం రేపుతోంది.
అదే యాంటీ క్లైమాక్స్. అల్లు అర్జున్ 'ఐకాన్' నెగటివ్ ఎండింగ్ ఉండబోతోందని సమాచారం అందుతోంది. గతంలో బన్ని 'వేదం' సినిమాలో ఇలాంటి యాంటీ క్లైమాక్స్ ప్రయత్నించాడు కానీ ఆ సినిమా డిజాస్టర్ గా మారింది. పైగా 'సరైనోడు' సినిమా తర్వాత బన్నీ కి మాస్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. ఇలాంటి సమయంలో ఇలాంటి సినిమాలు తీయడం రిస్క్ అని చెప్పుకోవచ్చు. యాంటీ క్లైమాక్స్ అయినప్పటికీ 'నిన్నుకోరి', 'మళ్ళీరావా', 'జెర్సీ' ఇలాంటి సినిమాలు మంచి విజయాన్ని సాధించినప్పటికీ బన్నీ ఇమేజ్ కి అవి సూటవుతాయా లేదా? అలాంటి క్లైమాక్స్ లను ఫ్యాన్స్ ఒప్పుకుంటారా లేదా? అనేది ఇప్పుడు ప్రశ్న పెద్ద ప్రశ్నగా మారింది. ప్రస్తుతం చిత్ర బృందం లో కూడా ఇదే చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది.