ఈ మధ్యనే 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' అనే సినిమాతో డిజాస్టర్ అందుకున్న అల్లు అర్జున్ దాదాపు సంవత్సరం తరువాత తన తదుపరి సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఉండబోతోంది అని ప్రకటించారు. ఈ ప్రకటన బయటకు వచ్చి చాలా కాలం అయింది కానీ ఇంకా ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లలేదు. అల్లు అర్జున్ కెరీర్ లో 19వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలు కానుందట.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ 24 నుండి సెట్స్ పైకి వెళ్లనుంది అని తెలుస్తోంది. 'డీజే' సినిమాలో అల్లు అర్జున్ సరసన నటించిన పూజ హెగ్డే ఈ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అరవింద సమేత' సినిమాకు సంగీతాన్ని అందించిన తమన్ ఈ సినిమాకు కూడా సంగీతాన్ని అందించనున్నారు. గీత ఆర్ట్స్ మరియు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. బన్నీ-త్రివిక్రమ్ కాంబినేషన్ లో 'జులాయి', 'సన్నాఫ్ సత్యమూర్తి' సినిమాల తర్వాత మూడవ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.