R Narayana Murthy: సినిమా బతకాలి.. థియేటర్స్ బతకాలి
R Narayana Murthy: దేశంలో పేదవాడికి వినోదం లేదన్నారు ఆర్. నారాయణమూర్తి.
R Narayana Murthy: దేశంలో పేదవాడికి వినోదం లేదన్నారు ఆర్. నారాయణమూర్తి. ఓటీటీలో రిలీజైన సినిమాలను 25శాతం మంది మాత్రమే చూశారన్నారు ఆయన. మధ్య తరగతి, బడుగు వర్గాల ఇళ్లలో ఓటీటీ లేదన్న నారాయణ మూర్తి.. వాళ్లకెప్పుడు వినోదం ఇస్తారని ప్రశ్నించారు. సినిమా బతకాలన్న నారాయణ మూర్తి, థియేటర్లు తెర్చుకునేలా చూడాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరుతున్నట్లు చెప్పారు. కరోనా కు సంబంధించిన నియమ నిబంధనలను పాటిస్తూనే, ప్రభుత్వాలు థియేటర్లు నడపడానికి అనుమతి ఇవ్వాలని, అలానే సినిమా రంగంలోని పెద్దలు మొదట భారీ చిత్రాలను, క్రేజ్ ఉన్న సినిమాలను విడుదల చేస్తే జనం ధైర్యంగా థియేటర్లకు వస్తారని తెలిపారు.
థియేటర్లలో సినిమా చూస్తే కలిగే అనుభూతి మరో స్థాయిలో ఉంటుందని, ఇంట్లో టీవీ సెట్స్ లో చూస్తే ఆ ఉత్సాహం కలగదని నారాయణమూర్తి అన్నారు. మనిషి ఉన్నంత వరకూ థియేటర్లు ఉంటాయని, ఆ రకంగా చర్యలు తీసుకోవాలని కోరారు. సినిమా అంటే ఓ పండగ, ఓ జాతర, ఓ తిరనాళ్ళు అని ఆయన అన్నారు. ఇప్పటికే విడుదలైన 'నారప్ప'ను మినహాయించి, దయచేసి టక్ జగదీశ్, లవ్ స్టోరీ, విరాట పర్వం వంటి సినిమాలు థియేటర్లలోనే విడుదల కావాలని, త్వరలోనే తన రైతన్న సినిమానూ థియేటర్లలోనే విడుదల చేస్తానని ఆర్. నారాయణమూర్తి చెప్పారు.