Women Health: మహిళలకు అలర్ట్.. వీటిపై జాగ్రత్త లేకపోతే చాలా హెల్త్ సమస్యలు..!
Women Health: మహిళలు ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో హార్మోన్లు సమతుల్యంగా ఉండటం అవసరం. లేదంటే చాలా సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.
Women Health: మహిళలు ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో హార్మోన్లు సమతుల్యంగా ఉండటం అవసరం. లేదంటే చాలా సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత సాధారణంగా పీరియడ్స్ ప్రారంభ దశల్లో లేదా మెనోపాజ్, గర్భధారణ సమయంలో కనిపిస్తుంది. కానీ నేటి జీవనశైలిలో ఈ సమస్య చాలా ఎక్కువగా కనిపిస్తుంది. హార్మోన్ల సమతుల్యతను కాపాడుకోవడానికి రోజువారీ దినచర్య, ఆహారంలో కొన్ని మార్పులు చేయాలి. శరీరంలో జరిగే మార్పులపై మనం శ్రద్ధ వహించాలి. కాబట్టి హార్మోన్ల అసమతుల్యతకు కారణాలు, లక్షణాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.
హార్మోన్లు అంటే ఏమిటి?
శరీరంలో ఉండే ఎండోక్రైన్ వ్యవస్థ ద్వారా హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. ఇవి ఒక రకమైన రసాయనాలు. ఇవి శరీరంలోని వివిధ భాగాలకు చేరి దూతలుగా పనిచేస్తాయి. హార్మోన్ల పరిమాణం పెరిగినప్పుడు లేదా తగ్గినప్పుడు దానిని హార్మోన్ల అసమతుల్యత అంటారు. దీని ప్రభావం శరీరంపై అనేక సమస్యల రూపంలో కనిపిస్తుంది.
హార్మోన్లు అసమతుల్యత లక్షణాలు
మహిళల్లో హార్మోన్లు అసమతుల్యత ఏర్పడినప్పుడు ఋతు చక్రం చెడిపోవడం, ఆకస్మికంగా బరువు పెరగడం, తగ్గడం, నడుము నొప్పి, చర్మ సమస్యలు, జుట్టు రాలడం, బలహీనంగా, అలసటగా అనిపించడం, మలబద్ధకం సమస్య, నిద్రలేమి వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఈ ఆహారాల వల్ల హార్మోన్లకు ఆటంకం
చెడు ఆహారపు అలవాట్లు హార్మోన్ల అసమతుల్యతకు ప్రధాన కారణం. చక్కెర అధికంగా ఉండే ఆహారపదార్థాలు, శుద్ధి చేసిన పిండితో చేసిన పదార్థాలు, శుద్ధి చేసిన నూనె, ప్రాసెస్ చేసిన ఆహారాలు, మద్యపానం, ధూమపానం వంటివి హార్మోన్ స్థాయిలపై నెగిటివ్ ప్రభావాన్ని చూపుతాయి. ఇది కాకుండా రోజువారీ దినచర్య సరిగా లేకపోవడం వల్ల కూడా ఈ సమస్య ఎదురవుతుంది.
స్టెరాయిడ్ వినియోగం
మీరు ఏదైనా వ్యాధితో బాధపడుతూ నిరంతరం స్టెరాయిడ్స్ లేదా ఇతర మందులు తీసుకుంటుంటే హార్మోన్ల స్థాయిలు అసమతుల్యమయ్యే అవకాశం ఉంది. ఈ సందర్భంలో మీరు డాక్టర్‌ని సంప్రదించి తగిన సలహాలు, సూచనలు తీసుకోవాలి.
ఒత్తిడి తీసుకోవడం
మహిళల్లో హార్మోన్ల అసమతుల్యతకు ఒత్తిడి కూడా కారణం అవుతుంది. హార్మోన్లను సమతుల్యంగా ఉంచడానికి ఒత్తిడిని నివారించడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఎవరైనా ఎక్కువ ఒత్తిడిని తీసుకుంటే శరీరంలో కార్టిసాల్ హార్మోన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది నిద్రలేమి, అలసట వంటి సమస్యలను కలిగిస్తుంది.