Visceral Fat: విసెరల్ ఫ్యాట్‌తో చాలా డేంజర్ గురూ.. సేఫ్ జోన్‌లో ఉండాలంటే.. ఆ ప్లేస్‌పై ఫోకస్ పెట్టాల్సిందే..!
Reduce Visceral Fat: ప్రపంచవ్యాప్తంగా చాలా మంది విసెరల్ ఫ్యాట్ వ్యాధితో బాధపడుతున్నారు. ఇది కాలేయం వంటి ముఖ్యమైన అవయవాల చుట్టూ పేరుకుపోయే కొవ్వు.
Visceral Fat: ప్రపంచవ్యాప్తంగా చాలా మంది విసెరల్ ఫ్యాట్ వ్యాధితో బాధపడుతున్నారు. ఇది కాలేయం వంటి ముఖ్యమైన అవయవాల చుట్టూ పేరుకుపోయే కొవ్వు. దీనివల్ల మధుమేహం, గుండెపోటు, అధిక రక్తపోటు వంటి సమస్యలు చుట్టుముట్టేస్తాయి. అధిక బరువు లేదా ఊబకాయం ఉన్నవారిలో విసెరల్ కొవ్వు ఎక్కువగా ఉంటుందని చాలామంది అపోహ పడుతుంటారు. కానీ, సన్నగా ఉండే వ్యక్తులు, ముఖ్యంగా ఏపని చేయకుండా ఉండే వారు, వృద్ధులు కూడా ఈ వ్యాధికి గురయ్యే ప్రమాదం ఉంది. విసెరల్ ఫ్యాట్ ఎక్కువగా ఉండటం వల్ల ఆరోగ్యం దారుణంగా దెబ్బ తింటుంది. దాన్ని తగ్గించడం అంత సులభం కాదు. ముందుగానే జాగ్రత్త పడితే.. ఈ సమస్య నుంచి ఈజీగా బయటపడొచ్చు.
విసెరల్ కొవ్వు పెరుగుదల లక్షణాలు..
విసెరల్ ఫ్యాట్ పెరగడానికి పెద్ద సంకేతం మీ నడుము ఆకారమే. నడుము చుట్టు భాగం ఎత్తు.. మీ హైట్‌లో సగానికి పైగా ఉంటే, విసెరల్ కొవ్వు చాలా పెరిగిందని అర్థం. ఉదాహరణకు 5 అడుగుల 6 అంగుళాలు లేదా 66 అంగుళాలు ఉన్న వ్యక్తి.. ఆ వ్యక్తుల నడుము పరిమాణం 33 అంగుళాల కంటే తక్కువగా ఉండాలి. సాధారణంగా, పురుషులలో నడుము పరిమాణం 35 అంగుళాల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు, అలాగే స్త్రీలలో నడుము సైజు 30 అంగుళాల కంటే ఎక్కువగా ఉంటే.. విసెరల్ కొవ్వు పెరిగినట్లు గుర్తించాలి.
విసెరల్ కొవ్వును ఎలా తగ్గించుకోవాలి?
1. పీచుపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి..
పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటే, మీ పొట్ట చాలా సమయం వరకు నిండుగా ఉంటుంది. క్రమంగా విసెరల్ ఫ్యాట్ కూడా తగ్గడం ప్రారంభమవుతుంది. ఇందుకోసం పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్, పప్పులు తినాలి.
2. టెన్షన్‌కు దూరంగా ఉండాలి..
ఈ ఉరుకుల పరుగుల జీవితంలో టెన్షన్ ఉండటం సాధారణం. మీరు ఒత్తిడిని ఎదుర్కొన్నప్పుడు, కార్టిసాల్ శరీరంలో విడుదల అవుతుంది. అది కొవ్వు నిల్వ ఉన్న ప్రదేశానికి మారుతుంది. ఇది విసెరల్ కొవ్వును పెంచడానికి కట్టుబడి ఉంటుంది.
3. ప్రశాంతంగా నిద్రపోవాలి..
చాలామంది ఆరోగ్య నిపుణులు 7 నుంచి 8 గంటల నిద్ర మంచిదని సిఫార్సు చేస్తుంటారు. దీనివల్ల మన రోగనిరోధక శక్తి, మెదడు పనితీరు సరిగ్గా ఉంటుంది. కొవ్వు పెరగడం తగ్గిపోతుంది.
4. తీపి పదార్థాలు తక్కువగా తినాలి..
తీపి పదార్థాలను తినే ధోరణి మనదేశంలో చాలా ఎక్కువగా ఉంది. దీని కారణంగా శరీరంలో విసెరల్ కొవ్వు పెరుగుతుంది. అందుకే పండ్ల ద్వారా లభించే సహజసిద్ధమైన చక్కెరను పరిమిత పరిమాణంలో తీసుకోవచ్చు. అయినప్పటికీ, చక్కెర, దాని నుంచి తయారైన వస్తువులకు ఎంత దూరం ఉంటే అంత మంచిది.