World Organ Donation Day 2024 : నేడు ఆర్గన్ డోనేషన్ డే..మన శరీరంలో ఏఏ భాగాలను ఇతరులకు డొనేట్ చేయవచ్చో చూద్దాం
World Organ Donation Day 2024 : అవయవ దానం చేసే వ్యక్తిని 'అవయవ దాత' అని, అవయవాన్ని స్వీకరించే వ్యక్తిని 'గ్రహీత' అని అంటారు. చాలా సందర్భాలలో, గ్రహీత జీవితాన్ని రక్షించడానికి అవయవ దానం అవసరం. అవయవ దానానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం.
World Organ Donation Day 2024 : మానవ శరీరం అనేది ప్రకృతి అందించిన వరం. ఈ సృష్టిలో ఎన్ని జీవాలు ఉన్నప్పటికీ మనిషికి సాటి అయిన జీవి మరొకటి లేదు అని చెప్పవచ్చు. మానవ మేధస్సుతో ఈ ప్రపంచాన్ని మారుస్తున్నాడు. అలాంటి మానవ శరీరాన్ని చనిపోయిన తర్వాత కూడా అవయవ దానం రూపంలో మరో జీవితాన్ని గడిపే అవకాశం ఉంటుంది. అవయవ దానం ద్వారా ప్రాణాపాయంలో ఉన్నవారు సైతం తిరిగి పునరజీవనం అయ్యే అవకాశం ఉంటుంది. మన తదనంతరం మనం ఈ భూమి మీద జీవించాలి అనుకుంటే అవయవ దానం ఒక మార్గంగా చెప్పవచ్చు.
ఈ రోజు అవయవ దాన దినోత్సవం. ఈ సందర్భంగా అవయవదానం గురించి ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఈ దినోత్సవాన్ని జరుపుతున్నారు. ఇందు కోసం వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అవయవ దానం ద్వారా ఒక వ్యక్తికి కొత్త జీవితాన్ని అందించవచ్చు. అవయవ దానం చేసే వ్యక్తిని 'అవయవ దాత' అని, అవయవాన్ని స్వీకరించే వ్యక్తిని 'గ్రహీత' అని అంటారు. చాలా సందర్భాలలో, గ్రహీత జీవితాన్ని రక్షించడానికి అవయవ దానం అవసరం. అవయవ దానానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం.
ఏయే శరీర భాగాలు మరియు అవయవాలను దానం చేయవచ్చు?
అవయవ దానంలో, శరీరంలోని కొన్ని అవయవాలు, కణజాలాలను దానం చేయవచ్చు. దానం చేయగలిగే అవయవాలలో కాలేయం, మూత్రపిండాలు, క్లోమం, గుండె, ఊపిరితిత్తులు, ప్రేగులు ఉన్నాయి. దానం చేయగలిగే కణజాలాలలో కార్నియా (కంటి భాగం), ఎముక, చర్మం, గుండె కవాటాలు, రక్తనాళాలు, సిరలు, సహా కొన్ని ఇతర కణజాలాలు కూడా ఉన్నాయి.
అవయవ దానం కోసం వయస్సు:
అవయవ దానానికి, వయస్సుతో పాటు శరీరం ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం. అయితే, అవయవ దానం జీవించి ఉన్నప్పుడు లేదా మరణించిన తర్వాత చేస్తున్నారా అనే దానిపై ఆధారపడి ఉంటుంది. 18 ఏళ్లు నిండిన ఆరోగ్యవంతులైన ఎవరైనా అవయవాలను దానం చేసేందుకు అర్హులు. కానీ వివిధ శరీర భాగాలకు వయస్సు పరిమితి కూడా భిన్నంగా ఉంటుంది, ఇది వైద్యుల సలహా మేరకు మాత్రమే దానం చేయవచ్చు.
అవయవ దానంలో ఎన్ని రకాలు ఉన్నాయి?
అవయవ దానం రెండు విధాలుగా జరుగుతుంది. మొదటిది జీవించి ఉన్నప్పుడు, రెండవది మరణం తర్వాత. అవయవ దానం కోసం, మరణించిన తర్వాత ఆ వ్యక్తికి సంబంధించిన ఏ భాగాలను దానం చేయవచ్చో వారు బతికి ఉన్నప్పుడు వీలునామా తీసుకున్న తర్వాతే ఇవ్వాల్సి ఉంటుంది. గడచిన కొన్ని దశాబ్దాలుగా నేత్రదానం గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. చనిపోయిన తర్వాత మన నేత్రాలను దానం చేయడం ద్వారా ఇద్దరు వ్యక్తులకు చూపు ప్రసాదించవచ్చని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో చాలా మంది తమ కళ్ళను తదనంతరం డొనేట్ చేస్తున్నారు. దీంతో ఎంతో మంది అంధులకు చూపు లభిస్తోంది.
కొన్ని అవయవాలను మనం జీవించి ఉన్నప్పుడే దానం చేయవచ్చు, అందులో ఒకటి కిడ్నీ, కాలేయం ప్రధానమైనవి. మన తదనంతరం కళ్ళు,ఊపిరితిత్తులు, గుండె, క్లోమం ప్రేగుల దానం చేయవచ్చు.