Diabetes: కళ్లలో ఈ మార్పులా.? డయాబెటిస్ కావొచ్చు..
Diabetes: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా భారత్‌లో డయాబెటిస్ బారినపడుతోన్న వారి సంఖ్య ఎక్కువవుతోంది.
Diabetes: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా భారత్‌లో డయాబెటిస్ బారినపడుతోన్న వారి సంఖ్య ఎక్కువవుతోంది. మారిన జీవిన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా చిన్న వయసులోనే ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఒకప్పుడు 50 ఏళ్లు నిండిన వారిలో మాత్రమే కనిపించే ఈ సమస్య ప్రస్తుతం పాతికేళ్లు కూడా నిండని వారిలో కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. ఒక్కసారి డయాబెటిస్ వ్యాధి సోకిందా పూర్తిగా తగ్గడం అంత సులువుకాదు.
అందుకే డయాబెటిస్ వచ్చిన వారు చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తుంటారు. తీసుకునే ఆహారం మొదలు, జీవనశైలిలో మార్పులు చేసుకోవాలని చెబుతుంటారు. అయితే డయాబెటిస్‌ను కాస్త ముందస్తుగా గురిస్తే నివారణ చర్యలు సైతం అదే స్థాయిలో తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముందుగా గుర్తించి సరైన చికిత్స తీసుకుంటే ప్రభావం నుంచి బయటపడొచ్చు. శరీరంలో డయాబెటిస్ వచ్చిందన్న విషయాన్ని కొన్ని లక్షణాల ద్వారా ముందుగానే తెలుసుకోవచ్చు. కళ్లలో జరిగే కొన్ని మార్పులు డయాబెటిస్‌కు ముందస్తు లక్షణమని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
రాత్రిపూట కళ్లు సరిగ్గా కనిపించకపోతే వెంటనే అలర్ట్ అవ్వాలని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో చక్కెర స్థాయిలు పెరిగితే అది కంటి నరాలపై ప్రభావం పడుతుంది. దీంతో కంటి చూపు మందగిస్తుంది. కొందరిలో ఉదయం లేవగానే కళ్లు మసకబారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది కూడా డయాబెటిస్‌కు ముందస్తు లక్షణంగా భావించాలి.
కళ్లలో నొప్పిగా ఉండడం, ఒత్తిడిగా ఉన్న భావన కలగడం వంటివి కూడా డయాబెటిస్‌కు ముందస్తు లక్షణంగా భావించాలని నిపుణులు చెబుతున్నారు. ఏ కారణం లేకుండా కంటిలో నొప్పిగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించి సంబంధిత పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇక కళ్లు ఉబ్బినట్లు కనిపించినా, కంటి చుట్టూ భాగంగా ఉబ్బినట్లు కనిపిస్తే షుగర్‌కు ప్రాథమిక లక్షణంగా భావించాలని నిపుణులు చెబుతున్నారు. రక్తంలో చక్కెర స్థాయి పెరగడం వల్ల కంటి నరాలపై ప్రభావం పడి ఉబ్బుతాయని అంటున్నారు. డయాబెటిస్ ఎక్కువైనా వారిలో కంటి చూపు తగ్గే అవకాశం కూడా ఉంటుంది. అందుకే పైన తెలిపిన లక్షణాల్లో ఏవి కనిపించినా వెంటనై వైద్యులను సంప్రదించి, సంబంధిత పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.
నోట్: పైన తెలిపిన విషయాలు వివిధ మార్గాల్లో సేకరించిన సమాచారం ఆధారంగా అందించినవి మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు, సలహాలు పాటించడమే ఉత్తమం.