Heart attack: ఉన్నపలంగా గుండె ఎందుకు ఆగిపోతుంది.? కారణాలు ఇవే..
ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్ కారణంగా గుండె అకస్మాత్తుగా రక్తాన్ని పంపింగ్ చేయడం ఆగిపోతుంది. దీంతో మెదడుతో పాటు శరీరంలోని చాలా భాగాలకు రక్త సరఫరా ఆగిపోతుంది.
కార్డియాక్ అరెస్ట్.. ఇటీవల ఈ పదం ఎక్కువగా వినిపిస్తోంది. ఉన్నపలంగా గుండె పనిచేయకపోవడాన్నే కార్డియాక్ అరెస్ట్‌గా చెబుతుంటారు. సాధారణంగా హార్ట్ ఎటాక్ వస్తే బతికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ కార్డియాక్ అరెస్ట్ వస్తే మాత్రం వెంటనే గుండె పని చేయడం ఆగిపోతుంది. ఇంతకీ ఈ కార్డియాక్ అరెస్ట్‌కు అసలు కారణం ఏంటి.? ఈ సమస్య దరి చేరకుండా ఉండాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్ కారణంగా గుండె అకస్మాత్తుగా రక్తాన్ని పంపింగ్ చేయడం ఆగిపోతుంది. దీంతో మెదడుతో పాటు శరీరంలోని చాలా భాగాలకు రక్త సరఫరా ఆగిపోతుంది. దీని కారణంగా వ్యక్తి అపస్మారక స్థితికి చేరుకుంటాడు. అలాగే హార్ట్ బీట్ ఒక్కసారిగా తగ్గిపోతుంది. ఈ సమయంలో వెంటనే చికిత్స అందకపోతే మనిషి ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. అందుకే కార్డియాక్ అరెస్ట్ అయిన క్షణాల్లోనే బాధితుడిని వైద్యుల వద్దకు తీసుకెళ్లాలని నిపుణులు చెబుతున్నారు. కార్డియాక్ అరెస్ట్ అయ్యే ముందు కనిపించే లక్షణాల విషయానికొస్తే.. ఛాతీలో తీవ్రమైన నొప్పి, అసౌకర్యంగా ఉంటుంది. అయితే ఇది కేవలం కొన్ని క్షణాల ముందే కనిపిస్తుంది. చాలా సందర్భాల్లో ఎలాంటి లక్షణాలు లేకుండానే.. కార్డియాక్ అరెస్ట్ వస్తుంది.
ఇక కార్డియాక్ అరెస్ట్ రావడానికి ప్రధాన కారణాల్లో అనారోగ్యకరమైన జీవనశైలి ముఖ్యమైందని నిపుణులు చెబుతున్నారు. తప్పుడు ఆహారపు అలవాట్లు, అధిక ఒత్తిడి, స్మోకింగ్, కూడా ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్‌కు చాలా కారణమవుతాయి. ముఖ్యంగా ఒత్తిడి పెరగడం, అధిక రక్తపోటు కూడా ఇందుకు కారణమవుతుందని అంటున్నారు. ఒత్తిడికి గురైనప్పుడు శరీరంలో విడుదలయ్యే హార్మోన్ల కారణంగా గుండె, నాళాలను బలహీనపరుస్తుంది. దీని కారణంగా, గుండె ఆరోగ్యం క్షీణించడం ప్రారంభమవుతుంది. దీని కారణంగా, గుండె అకస్మాత్తుగా రక్త సరఫరాను పొందలేకపోతుంది దీంతో గుండె పనిచేయడం ఆగిపోతుంది.
ఈ సమస్య బారిన పడకుండా ఉండాలంటే కొవ్వు తక్కువగా తీసుకోవాలని నిపుణులు చెబున్నారు. అలాగే కచ్చితంగా ప్రతీ రోజూ వాకింగ్ లేదా ఏదైనా వ్యాయామం చేయాలి. ఒత్తిడిని తగ్గించుకునేందుకు యోగా, మెడిటేషన్ వంటి వాటిని అలవాటు చేసుకోవాలి. మద్యం సేవించడం, స్మోకింగ్ అలవాట్లు ఉంటే పూర్తిగా మానేయాలన నిపుణులు చెబుతున్నారు.