Health Tips: శరీరానికి ఈ ఖనిజాలు చాలా అవసరం.. లేదంటే చాలా అనర్థాలు..!
Health Tips: ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి అనేక రకాల పోషకాలు అవసరం.
Health Tips: ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి అనేక రకాల పోషకాలు అవసరం. వీటిలో ఒకటి ఖనిజాలు. ఈ పోషకాలు శరీరానికి చాలా అవసరం కానీ చాలా మంది వీటి గురించి పట్టించుకోరు. మినరల్స్ మన కండరాలు, ఎముకలను బలోపేతం చేస్తాయి. అంటే పుష్కలంగా ఖనిజాలను తీసుకుంటేనే శరీరం బలంగా ఉంటుంది. ఈ పోషకాలు లోపిస్తే మీరు హార్మోన్ల అసమతుల్యతను ఎదుర్కోవలసి ఉంటుంది. వివిధ రకాలైన మినరల్స్ కోసం ఏయే ఆహారాలు తీసుకోవాలో తెలుసుకుందాం.
1. కాల్షియం
కాల్షియం ద్వారా ఎముకలు, మెదడు బలోపేతం అవుతాయి. దీని కోసం మీరు పాల ఉత్పత్తులు, వాల్‌నట్‌లు, పొద్దుతిరుగుడు గింజలు, ఆకుకూరలు, పప్పులు, సోయాబీన్స్, బఠానీలు, చిక్కుళ్ళు, నారింజ, వేరుశెనగ, వాల్‌నట్‌లను రెగ్యులర్ డైట్‌లో చేర్చుకోవచ్చు.
2. ఐరన్
శరీరంలో ఐరన్ లోపం ఉంటే రక్తంలో హిమోగ్లోబిన్ లోపం ఉంటుంది. ఇందుకోసం పిస్తా, ఉసిరి, డ్రై ఫ్రూట్, పాలకూర, బీట్‌రూట్, దానిమ్మ, యాపిల్, గ్రీన్ వెజిటేబుల్స్ తినవచ్చు.
3. పొటాషియం
పొటాషియం ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ఇందుకోసం పుట్టగొడుగులు, బెండకాయలు, ఎండుద్రాక్ష, ఖర్జూరం, అరటిపండ్లు, నారింజ, దోసకాయలు, బఠానీలు, గుమ్మడికాయలు వంటి ఆహార పదార్థాలను తినవచ్చు.
4. సెలీనియం
శరీరంలో సెలీనియం లోపం ఉంటే కండరాలు, కీళ్లలో నొప్పి తలెత్తుతుంది. ఇందుకోసం చికెన్, చేపలు, గుడ్డు, అరటిపండు, బ్లూబెర్రీ, సోయా మిల్క్‌లను రెగ్యులర్ డైట్‌లో చేర్చుకోవాలి.
5. జింక్
జింక్ రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఇది ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. దీని కోసం మీరు పప్పు, గుమ్మడికాయ, నువ్వులు, బాదం, గుడ్డు, గోధుమలు, బియ్యం, వేరుశెనగ, జీడిపప్పు, చిక్కుడు, పాలు, జున్ను, పెరుగు, ఎర్ర మాంసం తినవచ్చు.
6. మెగ్నీషియం
మెగ్నీషియం నాడీ వ్యవస్థ, రక్తపోటును మెరుగుపరుస్తుంది. ఎముకలను బలపరుస్తుంది. జీడిపప్పు, బాదం, బచ్చలికూర, సాల్మన్ ఫిష్, చికెన్ వేరుశెనగ, సోయా పాలు, బ్రౌన్ రైస్ తినడం ద్వారా ఇది లభిస్తుంది.