Social Media: మరో కీలక నిర్ణయం తీసుకున్న 'ఎక్స్'.. ఇకపై లైవ్ స్ట్రీమింగ్ చేయాలంటే
Social Media:ఎక్స్ బేసిక్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ధరను రూ. 215 నుంచి ప్రారంభించారు. కాగా ప్రస్తుతం ప్రీమియం సబ్‌స్క్రైబర్లను పెంచుకునే దిశగా మస్క్ వేగంగా అడుగులు వేస్తున్నారు.
Social Media: ప్రముఖ సోషల్ మీడియా సైట్ ట్విట్టర్‌ను ఎలాన్ మస్క్ కొనుగోలు చేసిన తర్వాత భారీగా మార్పులు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ట్విట్టర్ పేరును 'ఎక్స్'గా మార్చిన మస్క్.. ప్రస్తుతం ఆదాయాన్ని పెంచుకునే మార్గాన్ని అన్వేషిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
ఎక్స్ బేసిక్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ధరను రూ. 215 నుంచి ప్రారంభించారు. కాగా ప్రస్తుతం ప్రీమియం సబ్‌స్క్రైబర్లను పెంచుకునే దిశగా మస్క్ వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ఇకపై లైవ్‌స్ట్రీమ్‌ను ప్రారంభించాలంటే కచ్చితంగా ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఉండాలని 'ఎక్స్' పేర్కొంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. లైవ్ స్ట్రీమింగ్ ఆప్షన్ ఇప్పటికే ప్రముఖ సోషల్ మీడియా సైట్స్ అయిన.. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్, టిక్‌టాక్ వంటి వాటిలో అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే.
అయితే ఈ వేదికల్లో లైవ్ స్ట్రీమింగ్ చేయడానికి ఎలాంటి ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సి అవసరం ఉండదు. మొట్టమొదటిసారి ఎక్స్ ఈ దిశగా నిర్ణయం తీసుకుంది. దీంతో రానున్న రోజుల్లో ప్రీమియం సబ్‌స్క్రైబర్లు మాత్రమే ‘ఎక్స్’లో లైవ్ స్ట్రీమ్ చేసే సదుపాయం ఉండనుంది. ఈ నిబంధన ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. యాడ్స్ ద్వారా వచ్చే ఆదాయం తగ్గుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇందులో భాగంగా ఈ మార్పులు చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే కొత్త యూజర్లు చేసే పోస్ట్‌తో పాటు, లైక్, రిప్లయ్, బుక్‌మార్క్‌లకు సైతం చిన్న మొత్తంలో కొంత చెల్లించాల్సి రావొచ్చని మస్క్ ఇదివరకే ప్రకటించారు. ఇప్పటికే కొన్ని దేశాల్లో కొందరు యూజర్ల నుంచి ఫీజులు వసూలు చేయడం ప్రారంభించారు. మరి మిగతా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు కూడా ఎక్స్ దారిలో నడుస్తాయో లేదో చూడాలి.