Health News: సొంతంగా ఆహారాన్ని వండుకొని తినే వ్యక్తులు ఆరోగ్యంగా ఉంటారట..! అధ్యయనంలో ఆశ్చర్యకరమైన నిజాలు..
Health News: నగరాలు, పట్టణాలలో ప్రజల జీవనశైలి పూర్తిగా మారిపోయింది. చాలామంది బయటి ఆహారానికి అలవాటు పడిపోయారు.
Health News: నగరాలు, పట్టణాలలో ప్రజల జీవనశైలి పూర్తిగా మారిపోయింది. చాలామంది బయటి ఆహారానికి అలవాటు పడిపోయారు. సొంతంగా వంటచేసుకునే అలవాటుని మరిచిపోయారు. ఉరుకుల పరుగుల జీవితంలో ఆలస్యంగా రావడం, ఉదయమే వెళ్లడం వల్ల సమయం సరిపోక కొంతమంది ఇలా చేస్తున్నారు. మరికొంతమంది బద్దకం వల్ల వండుకోలేకపోతున్నారు. అయితే బయటి ఆహారం తినే వాళ్లు ఎప్పుడు ఏదో ఒక ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారు. వాస్తవానికి సొంతంగా వండుకొని తినేవాళ్లు ఆరోగ్యంగా ఉంటున్నారని ఒక అధ్యయనంలో తేలింది. ఆ వివరాల గురించి తెలుసుకుందాం.
US నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ జర్నల్‌లో మూడు సంవత్సరాల క్రితం ఒక అధ్యయనం ప్రచురించింది. ఇందులో అమెరికాలోని 800 కుటుంబాల ఆహార విధానాలను అధ్యయనం చేశారు. ఆహారాన్ని వండుకునే వ్యక్తులు 80 శాతానికి పైగా ఆరోగ్యంగా ఉన్నట్లు తేలింది. బయటి ఆహారం తినే వ్యక్తుల కంటే వీరు చాలా ఫిట్‌గా ఉన్నట్లు తేలింది. ఇప్పుడు మరో అధ్యయనం కూడా ఈ వాదనను ధృవీకరిస్తోంది. యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్, స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ చేసిన ఈ కొత్త అధ్యయనం కూడా ఇదే విషయాన్ని చెబుతోంది. బయటి రెస్టారెంట్లలో తయారు చేసిన ఆహారాన్ని ఆర్డర్ చేసే వారి కంటే సొంతంగా వంట చేసుకునే వారు ఆరోగ్యంగా ఉంటున్నట్లు తేల్చింది.
దీనికి గల కారణాలను పరిశోధకులు వివరించే ప్రయత్నం చేశారు. మనం ఇంట్లో వాడుతున్న ఉప్పు లేదా పంచదార రెస్టారెంట్‌లోని ప్రాసెస్‌డ్ ఫుడ్‌లో కలుస్తున్న దానికంటే చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాదు వీటిని ఒక్కసారి తింటే పదే పదే తినాలని అనిపిస్తుంది. కొన్ని రోజులకు వాటికి బానిసలా మారిపోతారు. ఇవి మానవ శరీరానికి ప్రమాదకరం. మన పేగులు దానిని జీర్ణించుకోలేవు. ఆ ఆహారం మన శరీరంలోకి వెళ్లి విషపదార్థాలను ఉత్పత్తి చేసి పేగుల్లో అంటుకుని రోగాలకు దారి తీస్తుంది. నార్వేకి చెందిన మరో అధ్యయనం కూడా ఇంట్లో వండిన ఆహారం మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుందని చెబుతోంది. ఇన్ని అధ్యయనాలు ఇదే విషయాన్ని చెబుతున్నాయంటే అది యాదృచ్చికం కాదు కదా..