Myositis: సమంతకు వచ్చిన 'మయోసైటిస్' వ్యాధి అంటే ఏమిటి.. ప్రాణాంతకమా? చికిత్స ఉందా?

Myositis: సమంత పోస్ట్‌తో మయోసైటిస్‌ అంటే ఏంటనే ప్రశ్న ప్రతీ ఒక్కరిని వేధిస్తుంది.

Update: 2022-10-31 10:07 GMT

Myositis: సమంతకు వచ్చిన 'మయోసైటిస్' వ్యాధి అంటే ఏమిటి.. ప్రాణాంతకమా? చికిత్స ఉందా?

Myositis: సమంత పోస్ట్‌తో మయోసైటిస్‌ అంటే ఏంటనే ప్రశ్న ప్రతీ ఒక్కరిని వేధిస్తుంది. ఈ నేపథ్యంలో అసలు మయోసైటిస్‌ అంటే ఏమిటి ? ఇది ప్రాణాంతకమా ? తగ్గుతుందా ? చికిత్స ఉందా ? అనే ప్రశ్నలు చాలా మందిలో మెదులుతున్నాయి. మరి వైద్యనిపుణులు ఏం చెబుతున్నారో ఓసారి చుద్దాం.

ఆటో ఇమ్యూన్‌ సమస్య కారణంగా వచ్చే వ్యాధి మయోసైటిస్. దీని వల్ల భుజాలు, తుంటి వద్ద కండరాల క్షీణత ఉంటుంది. దీన్నే పాలి మయోసైటిస్‌ అంటారు. కూర్చుంటే పైకి లేవలేరు. ఇది ఎవరికైనా వచ్చే అవకాశం ఉంది. చిన్న పిల్లల్లో 5 నుంచి 15 ఏళ్ల వారికి, పెద్దవాళ్లలో 45 నుంచి 65 ఏళ్ల వారికి ఎక్కువ కన్పిస్తుంది. మహిళలే ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడటం గమనార్హం. ఇదే సమస్య చర్మానికి కూడా వస్తుంటుంది. దాన్నే డెర్మటో మయోసైటిస్‌ అంటారు. దీనివల్ల కనురెప్పలపై ఊదా, ఎర్రరంగు మచ్చలు ఏర్పడతాయి. కళ్లు ఉబ్బుతాయి. ఎండలోకి వెళ్తే ముఖం ఎర్రగా మారిపోతుంది.

మనపై వ్యాధులు దాడి చేయకుండా శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ కాపు కాస్తుంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అదే వ్యవస్థ తిరిగి మన శరీరంపై దాడి చేస్తే అదే ఆటో ఇమ్యూన్‌ సమస్య. దీంతో వచ్చేదే మయోసైటిస్‌ జబ్బు. ఆటో ఇమ్యూన్‌తో పాటు వైరస్‌, కొన్ని మందుల ప్రభావంతోనూ మయోసైటిస్‌ వస్తుంది. వైరల్‌ మయోసైటిస్‌లో కండరాల నొప్పులు తీవ్రంగా ఉంటాయి. కదలించలేని పరిస్థితి ఏర్పడుతుంది. వైరస్‌ ప్రభావం తగ్గగానే తగ్గుతుంది. కొన్ని మందుల కారణంగా వచ్చే మయోసైటిస్‌ అవి ఆపేసిన వెంటనే తగ్గిపోతుంది.

కొన్ని బయోకెమిస్ట్రీ పరీక్షల ద్వారా మయోసైటిస్‌ను గుర్తిస్తారు. సాధారణంగా రక్తంలో క్రియాటిన్‌ ఇన్‌ ఫాస్పోకైనేజ్‌ స్థాయిలు 150 నుంచి 200 వరకు ఉంటాయి. అదే మయోసైటిస్‌ రోగుల్లో వేలకు చేరతాయి. అంతేకాక మయోసైటిస్‌ సంబంధిత యాంటీబాడీలు కూడా పెరుగుతాయి. ఎలక్ట్రోమయోగ్రఫీ పరీక్షతో కండర దృఢత్వాన్ని తెలుసుకొని వ్యాధిని అంచనా వేస్తారు. వ్యాధి జన్యుపరంగా వచ్చే అవకాశం ఉంది. అధిక బరువు, వ్యాయామం లేకపోవడం జంక్‌ఫుడ్స్‌ తీసుకోవడం లాంటివి కారణం కావచ్చు. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలతో సమతులాహారం, రోజూ గంట పాటు వ్యాయామం, తగినంత నిద్ర ఉంటే ఇలాంటి వ్యాధులకు దూరంగా ఉండొచ్చు.

మయోసైటిస్‌కు వంద శాతం చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. వ్యాధిని గుర్తించగానే స్టెరాయిడ్స్‌, ఇమ్యూనిటీ మాడ్యులేటింగ్‌ మందులు, బయలాజికల్‌ ఔషధాలతో తగ్గుతుంది. కొందరికి ఇమ్యునోగ్లోబలిన్‌ చికిత్స అందించాలి. త్వరగా గుర్తించి చికిత్స తీసుకుంటే మేలు. జాప్యం చేస్తే కొందరిలో ఊపిరితిత్తులపై ప్రభావం చూపి, పల్మనరీ పైబ్రోసిస్‌కు దారి తీస్తుంది. ఒత్తిడి తగ్గించుకోవాలి. జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. వైరల్‌, కొన్ని రకాల మందుల వల్ల మయోసైటిస్‌లు వచ్చినా తర్వాత తగ్గిపోతాయి. ఆటో ఇమ్యూన్‌ కారణంగా వచ్చే మయోసైటిస్‌కు కొన్నిసార్లు దీర్ఘకాలం మందులు వాడాలి.

ఈ వ్యాధిని దీర్ఘకాలిక కండరాల వాపు అని చెప్పుకోవచ్చు. ఈ వ్యాధి వచ్చిన వారిలో కొందరికి చర్మం దద్దుర్లు కూడా ఉంటాయి. ఈ అరుదైన వ్యాధిని నిర్ధారించడం కూడా కష్టమే. ఈ వ్యాధి ఎందుకు వచ్చిందనే విషయాన్ని కూడా కొన్ని సార్లు నిర్ధారించలేము. కాలక్రమేణా ఈ వ్యాధి లక్షణాలు చాలా వేగంగా కనిపిస్తాయి. కండరాల నొప్పి, పుండ్లు పడటం, అలసట, మింగడంలో ఇబ్బంది, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివి ఈ వ్యాధి ప్రాథమిక లక్షణాలుగా చెప్పుకోవచ్చు.

అమెరికాలో ప్రతి ఏటా ఈ కేసులు కొత్తగా 1,600 నుంచి 3,200 వరకు నమోదవుతుంటాయి. ప్రస్తుతం ఆ దేశంలో 50 వేల నుంచి 75 వేల వరకు మయోసైటిస్ వ్యాధిగ్రస్తులు ఉన్నారని అంచనా. మయోసైటిస్ లో ఐదు రకాలు ఉన్నాయి. డెర్మటో మయోసైటిస్, ఇంక్లూజన్ బాడీ మయోసైటిస్, జువెనైల్ మయోసైటిస్, పాలీ మయోసైటిస్, టాక్సిక్ మయోసైటిస్ అనే రకాలు ఉన్నాయి.

మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్నట్లు ఇన్‌స్టా వేదికగా సామ్ పోస్ట్ చేయగా ఆమె త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ ప్రార్ధిస్తున్నారు. గెట్ వెల్ సూన్ సామ్ అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఏది ఏమైనా సామ్ త్వరగా కోలుకావాలి ఆరోగ్యంగా మరిన్ని సినిమాలతో మనముందుకు రావాలి.  

Tags:    

Similar News