IVF Treatment: ఐవీఎఫ్ ట్రీట్మెంట్‌తో ప్రెగ్నెన్సీకి ఎంత సమయం పడుతుంది.. ఖర్చు ఎంతవుతుంది..!
IVF Treatment: నేటి రోజుల్లో కొత్త జంటలకు పిల్లలు కలగకపోవడం అతి పెద్ద సమస్యగా మారింది. ఇందుకు చాలా కారణాలు ఉంటున్నాయి.
IVF Treatment: నేటి రోజుల్లో కొత్త జంటలకు పిల్లలు కలగకపోవడం అతి పెద్ద సమస్యగా మారింది. ఇందుకు చాలా కారణాలు ఉంటున్నాయి. ముఖ్యంగా జీవనశైలి, ఆహార విధానంలో మార్పు, జన్యులోపాల వల్ల ఇలాంటి కేసులు పెరుగుతున్నాయి. తల్లిదండ్రులు కావాలనేది ప్రతి జంట కోరుకుంటుంది. కానీ కొన్నిసార్లు కొన్ని సమస్యల వల్ల దంపతులు బిడ్డకు జన్మనివ్వలేరు. ఈ పరిస్థితిలో వైద్య సాయం తీసుకోవాల్సి ఉంటుంది. IVF అంటే ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ అనేది తల్లి కావడానికి ఎక్కువగా ఉపయోగించే టెక్నిక్. ఇది వంధ్యత్వ సమస్యను తొలగిస్తుంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
'ఐవీఎఫ్' అంటే ఏమిటి..?
స్త్రీ, పురుషుల మధ్య ఏదైనా సమస్య వచ్చినప్పుడు వారు సంతానం పొందలేరు. అప్పుడు వైద్యులు 'IVF' అనే ప్రత్యేక చికిత్స చేస్తారు. ఇందులో స్త్రీ అండాలు, పురుషుడి శుక్రకణాలను బయటకు తీసి ల్యాబ్‌లో వాటిని కలుపుతారు. ఇలా చేయడం వల్ల కొత్త పిండం ఏర్పడుతుంది. ఈ పిండాన్ని మళ్లీ స్త్రీ కడుపులోకి ప్రవేశపెడతారు. ఈ విధంగా ఆమె గర్భవతి అయి బిడ్డకు జన్మనిస్తుంది. IVF మంచి సక్సెస్ రేటును కలిగి ఉంది. దీని సాయంతో చాలా మంది జంటలు తల్లిదండ్రులు అయ్యారు.
IVF కు ఎంత సమయం పడుతుంది?
IVF ద్వారా చాలా మంది జంటలు పిల్లలకు జన్మనిచ్చారు. IVF ప్రారంభించినప్పటి నుంచి పాజిటివ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పొందే సమయం సాధారణంగా 4 నుంచి 6 వారాలు ఉంటుంది. ఈ పద్దతిలో అండాన్ని ప్రేరేపించడానికి స్త్రీకి హార్మోన్ ఇంజెక్షన్లు ఇస్తారు. అప్పుడు అండం పురుషుడి స్పెర్మ్‌తో కలిపి స్త్రీ గర్భాశయంలోకి బదిలీ చేస్తారు. అప్పుడు టెస్ట్ ద్వారా ప్రెగ్నెన్సీ నిర్ధారిస్తారు.
ఖర్చు ఎంత..?
IVF ఖర్చు హాస్పిటల్, నగరం, చికిత్స రకంపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా భారతదేశంలో IVF చేయించుకోవడానికి అయ్యే ఖర్చు రూ.1.5 లక్షల నుంచి రూ. 2 లక్షల వరకు ఉంటుంది. కానీ చాలాసార్లు ప్రయత్నాలు చేయాల్సి వస్తే ఈ ఖర్చు రూ. 2 నుంచి 5 లక్షల వరకు ఉంటుంది. ఖర్చులలో చికిత్స, మందులు, పరీక్షలు, హాస్పిటల్ రెంట్ మొదలైనవి ఉంటాయి.ఇందుకోసం ముందుగా హాస్పిటల్ నుంచి ఎంత ఖర్చవుతుందనే పూర్తి సమాచారాన్ని తెలుసుకుంటే మంచిది. ఐవీఎఫ్ కోసం బీమా కంపెనీలు కూడా కవరేజీని అందించడం ప్రారంభించాయి.
IVF కోసం సరైన వయసు ఎంత..?
స్త్రీ వయస్సు 30 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ వయస్సు IVF కోసం చాలా సరిఅయినదిగా చెబుతారు. ఎందుకంటే ఈ వయస్సులో అండం నాణ్యత మెరుగ్గా ఉంటుంది. పురుషుల వయస్సు - 40 నుంచి 45 సంవత్సరాల వయస్సు ఉండాలి. ఈ సమయంలో పురుషులు IVFకి అనుకూలంగా ఉంటారు. ఎందుకంటే స్పెర్మ్ నాణ్యత ఈ వయస్సు వరకు బాగానే ఉంటుంది.