Green Tea: మీరు గ్రీన్ టీ తాగుతున్నారా.. ఐతే ఇది మీరు తెలుసుకోవాల్సిందే..!
Green Tea: మనలో చాలామందికి ఉదయం నిద్రలేవగానే కడుపులో టీ, కాఫీ పడాల్సిందే.
Green Tea: మనలో చాలామందికి ఉదయం నిద్రలేవగానే కడుపులో టీ, కాఫీ పడాల్సిందే. లేదంటే రోజు ప్రారంభం కాదు. అయితే ఈ మధ్య కాలంలో గ్రీన్ టీ ట్రెండ్ గా మారింది. ఆరోగ్యం పై శ్రద్ధ పెరగడంతో చాలామంది ఉదయమే గ్రీన్ టీ తాగుతున్నారు. దీనిలో నిమ్మకాయను కలిపి తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఆరోగ్య ప్రయోజనాల కోసం చాలా మంది గ్రీన్ టీ మీద ఆధారపడుతున్నారు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు గ్రీన్ టీని ఎంచుకుంటున్నారు. అయితే ఎంత తాగాలి, ఎప్పుడు తాగాలి, ఎలా తాగకూడదు అనే విషయాలు తెలియక చాలామంది ఆరోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు.
గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ పలు రకాల క్యాన్సర్ల నుంచి మనల్ని కాపాడతాయి. గుండె జబ్బులను దరి చేరకుండా చేస్తాయి. కీళ్ల నొప్పులు, కీళ్లవాతం సమస్యలకు సైతం చెక్ పెడతాయి. మెదడు చురుగ్గా పని చేయడానికి గ్రీన్ టీ తోడ్పాటును అందిస్తుంది. అంతేకాదు రక్తంలో చక్కెర స్థాయిలను సైతం నియంత్రిస్తుంది. నోటి ఆరోగ్యానికి కూడా గ్రీన్ టీ ఔషధంలా పని చేస్తుంది. అలాగే, మన శరీరంలోని తేమను రక్షించడంలో గ్రీన్ టీ ఎంతో సహాయకారిగా పనిచేస్తుంది. తద్వారా మనం రోజంగా ఎనర్జిటిక్ గా ఉండగలం.
ఎలా తాగితే మంచిది
మనలో చాలామంది వేడి నీటిలో డైరెక్ట్ గా గ్రీన్ టీని కలిపి సేవిస్తుంటారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. నీటిని వేడి చేసి చల్లార్చిన తర్వాతే గ్రీన్ టీ కలపాలి. గ్రీన్ టీలో నిమ్మరసం కలుపుకొని తాగితే ఉత్తమ ఫలితాలను అందుకోగలం ఎందుకంటే, గ్రీన్ టీలోని పోషకాలను శరీరం గ్రహించడంలో నిమ్మరసం సహాయపడుతుంది.
ఎంత తాగాలి
గ్రీన్ టీ తాగితే ఆరోగ్యానికి మంచిది. గ్రీన్ టీతో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో సుగుణాలు ఉన్నాయని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు. అయితే ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు కదా అని ఎక్కువ తాగితే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది. రోజులో సగటున 3 కప్పులకు మించకుండా చూసుకోవాలి. ఎక్కువగా తీసుకుంటే జీర్ణ సమస్యలతో పాటు డిప్రెషన్ సమస్యలను తెచ్చిపెడుతుంది. ఏదైనా మితంగా వాడితేనే సత్ఫలితాలు ఉంటాయనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి.
ఎప్పుడు తాగకూడదు
మనలో చాలామంది గ్రీన్ టీని ఉదయం పూట తాగుతున్నారు. ఇలా తాగడం ఎంతమాత్రం మంచిది కాదు. ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ చెడిపోయే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యాయామం చేసిన తర్వాత ఉదయం 11-12 గంటల మధ్య, భోజనానికి గంట ముందు, సాయంత్రం అల్పాహారం తర్వాత గ్రీన్ టీ తాగకూడదు. అలాగే రాత్రి పడుకునే ముందు కూడా గ్రీన్ టీకి దూరంగా ఉండడం ఉత్తమం. మరో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, UGT1A4 జన్యులోపం ఉన్న మహిళలకు గ్రీన్ టీ సప్లిమెంట్ తీసుకున్న తర్వాత కాలేయ ఒత్తిడి 80 శాతం పెరిగినట్లు ఒక పరిశోధనలో వెల్లడి అయింది. కాబట్టి అధిక ప్రమాదాన్ని కొనితెచ్చుకోకుండా గ్రీన్ టీని మితంగా తీసుకోవడం అన్ని విధాలా మంచిది.