Constipation: మలబద్ధకంతో విసిగిపోయారా.? వెంటనే రిలిఫ్ కావాలంటే..
మలబద్ధకం సమస్య మరెన్నో అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. దీంతో ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు చాలా మంది రకరకాల మందులను ఉపయోగిస్తున్నారు.
ప్రస్తుతం మలబద్ధకం బారిన పడుతోన్న వారి సంఖ్య భారీగా పెరిగింది. తీసుకుంటున్న ఆహారంలో మార్పులు, ఒత్తిడితో కూడుకున్న జీవితం, శారీరర శ్రమ లేకపోవడం వల్ల చాలా మందిలో ఈ సమస్య కనపిస్తోంది. మలబద్ధకం సమస్య మరెన్నో అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. దీంతో ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు చాలా మంది రకరకాల మందులను ఉపయోగిస్తున్నారు. దీంతో ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మరి సహజంగా ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే ఎలాంటి పద్ధతులు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
* మలబద్ధకం సమస్య నుంచి బయటపడాలంటే తీసుకునే ఆహారంలో ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా తీసుకుంటే ఆహారంలో పండ్లు, కూరగాయలు, గోధుమలు, బీన్స్ వంటి పదార్థాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధకాన్ని దూరం చేస్తుంది.
* ఇక సరిపడ నీటిని తీసుకోవడం వల్ల కూడా మలబద్ధకం సమస్య దూరమవుతుందని నిపుణులు చెబుతున్నారు. రోజుకు కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీటిని తీసుకోవాలని చెబుతున్నారు. దీనివల్ల జీర్ణక్రియ సులభతరం అవుతుంది.
* రోజులో కచ్చితంగా కాసేపైనా వ్యాయామం చేయడాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వాకింగ్, జాగింగ్, యోగా వంటి వ్యాయామాలు చేయాలి.
* ఇక తీసుకునే ఆహారం సమయంలో విషయంలో కూడా జాగ్రత్తలు వహించాలి. రోజూ ఒకే సమయంలో ఆహారం తీసుకోవడాన్ని అలవాటు చేసుకోవాలి. ఇది మెరుగైన జీర్ణక్రియకు దోహదపడుతుంది.
* చాలా మందిలో నిద్రలేమి కారణంగా కూడా జీర్ణక్రియ సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి రోజు కచ్చితంగా 7 నుంచి 8 గంటలు నిద్ర ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు.
* వీటితో పాటు నువ్వుల నూనె కూడా మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. ఇందుకోసం రాత్రి పడుకునే ముందు ఒక చెంచా నువ్వుల నూనెను తీసుకోవాలి. దీంతో ఉదయం లేవగానే సుఖ విరోచనం అవుతుంది.
* ఇక పండ్లను కూడా ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబతుతున్నారు. ప్రతీ రోజూ ఏదో ఒక పండును తీసుకోవాలని చెబుతున్నారు. ముఖ్యంగా అరటి పండును రోజుకు ఒకటి తీసుకుంటే మలబద్ధకం సమస్య బలాదూర్ అవుతుంది.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. గూగుల్‌తో పాటు ఇతర వేదికల్లో అందుబాటులో ఉన్న సమాచారాన్ని అందించడం జరిగింది. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.