Health Tips: తొక్కలో లాభాలు కాదు...తొక్కనిండా లాభాలు
Health Tips: మరి తొక్క తీసిన తర్వాత ఏ పండ్లను తినాలి...ఏ పండ్లను తొక్కతో తింటే మేలు...ఈ విశేషాలను ఇప్పుడు తెలుసుకుంద్దాం..
Health Tips: పండ్లు తింటున్నప్పుడు , కోసేటప్పుడు పొట్టు తొలిగించి పండును తినాలా లేదా తొక్కతో తినాలా అని చాలా సార్లు అర్థం కాదు. ఈ రోజుల్లో కల్తీ, రసాయనాల వల్ల చాలా మంది పండ్లు తొక్కలు తీసేసి తింటుంటారు. ఆపిల్ నుంచి బొప్పాయి వరకు అనేక పండ్లను అందంగా మెరిసేలా చేయడానికి రసాయనాలు ఉపయోగిస్తారు. దీని కారణంగా మనం తోలు తీసివేసి తినడం ప్రారంభించాం. అయితే ఇలా చేయడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు మనకు అందడం లేదు. కొన్ని రకాల పండ్లకు తొక్క తీసేసి తినడం వల్ల మనకు పెద్దగా ప్రయోజనం ఉండదు. మరి తొక్క తీసిన తర్వాత ఏ పండ్లను తినాలి...ఏ పండ్లను తొక్కతో తింటే మేలు...ఈ విశేషాలను ఇప్పుడు తెలుసుకుంద్దాం..
మన శరీర పోషణకు, నిర్వహణకు కావాల్సిన కీలకమైన పోషకాలను పండ్లు అందిస్తాయి. ప్రతి ఆహారంలోనూ కొవ్వులు ఉంటాయి కానీ పండ్లలో ఉండవు. ప్రకృతి సహజంగా దొరికే పండ్లలో కొవ్వులు, సోడియం, కేలరీలు చాలా తక్కువ. కొలెస్ట్రాల్ ఉండనే ఉండదు. రోజూ మూడు పూటలా భోజనం చేస్తే శరీరానికి శక్తి వస్తుందనుకుంటాం. అయితే సాధారణ భోజనం వల్ల అవసరమైన సూక్ష్మ పోషకాలన్నీ లభించవు. పొటాషియం, పీచుపదార్థాలు, విటమిన్ సి, పోలికామ్లం.. ఇలాంటివన్నీ పండ్ల వల్లే అందుతాయి.
పండ్లు.. కూరగాయలను తొక్కలతో తీసుకుంటే అనేక ప్రయోజనాలున్నాయని పోషకాహార నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కొన్ని పండ్లలో ఎక్కువగా పోషక విలువులు ఉన్నాయని..అలాంటి పండ్ల తొక్కలను సలాడ్స్ గా .. గ్రైండ్ చేసి పేస్ట్ గా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇలా ఎందుకంటే, పండ్లు, కూరగాయల్లో ఉండే పోషకాల్లో సుమారు 25 నుంచి 30 శాతం వరకు తొక్కలోనే ఉంటాయట. తొక్క తొలిగించిన పండ్లు, కూరగాయలతో పోల్చితే తొలిగించని వాటిలో విటమిన్లు, ఖనిజాలు, మొక్కలు ఆధారిత సమ్మేళనాలు పుష్కలంగా లభిస్తాయంటున్నారు నిపుణులు. తొక్క తీసేసిన యాపిల్ కంటే తొక్కతో కూడిన యాపిల్‌లో విటమిన్ కే- 332 శాతం, విటమిన్ ఏ-142 శాతం, విటమిన్ సి- 115 శాతం, క్యాల్షియం 20 శాతం, పొటాషియం 19 శాతం అధికంగా ఉంటాయట. అదే బంగాళాదుంపను తొక్కతో సహా ఉడికించడం వల్ల విటమిన్ సి 175 శాతం, పొటాషియం 115 శాతం, ఫోలేట్ 111 శాతం, మెగ్నీషియం-ఫాస్ఫరస్ 110 శాతం ఎక్కువగా శరీరానికి అందుతాయి.
యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటో న్యూట్రియంట్స్ నిండి ఉన్న యాపిల్స్ ని తొక్కతో పాటే తీసుకోవడం వల్ల అల్జీమర్స్ సమస్యతో పోరాడే శక్తిని శరీరానికి అందించవచ్చు. అలాగే యాపిల్ తొక్కలో ఉండే ట్రైటర్ పెనాయిడ్స్ అనే సమ్మేళనాలు క్యాన్సర్ ముప్పును చాలా వరకు తగ్గిస్తాయి. ఇక బేరీ పండ్లలో ఉండే ఫైబర్ లో సగానికి సగం దాని తొక్కలోనే ఉంటుందట. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ ఫ్లమేటరీ ఫైటోన్యూట్రియంట్లు శరీరానికి అందాలంటే తొక్కతో పాటే ఈ పండును తినాల్సి ఉంటుంది.
మానసిక ఒత్తిళ్లను దూరం చేసే పండ్లలో ప్లమ్స్ ముందుంటాయి. వీటి తొక్కలో క్లోరోజెనికామ్లం అనే యాంటీ ఆక్సిడెంట్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి మలబద్ధకం, ఇతర జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇక కివీ పండ్ల గుజ్జును తినడం కంటే వీటిని తొక్కతో పాటే తీసుకుంటే మూడు రెట్లు ఫైబర్ ని అధికంగా శరీరానికి అందించినట్లే అని నిపుణులు చెబుతున్నారు. కొవ్వు కణాల ఉత్పత్తిని అణిచివేయడానికి, శరీరంలో పేరుకుపోయిన అనవసర కొవ్వు నిల్వల్ని కరిగించడానికి మామిడి పండు తొక్కలో ప్రత్యేక గుణాలు ఉన్నాయి.
మామిడి తొక్కలో ఉండే కెరోటినాయిడ్స్, పాలిఫినోల్స్, ఒమేగా 3,6తో పాటు పాలీ అన్‌శ్యాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు...క్యాన్సర్, డయాబెటిస్, గుండె సంబంధిత సమస్యలన్నింటితో పోరాడతాయి. అలాగే టొమాటో తొక్కలో నారింజెనిన్ అనే ఫ్లెవనాయిడ్ ఉంటుంది. ఇది శరీరంలోని వాపును తగ్గించి వివిధ రకాల అనారోగ్యాల బారిన పడకుండా మనల్ని కాపాడుతుంది. బంగాళాదుంపలు, చిలగడ దుంప, క్యారెట్, బీట్‌రూట్ వంటి దుంపల తొక్కల్లో ఫైబర్, ఐరన్, విటమిన్ సి, పొటాషియం, ఫోలేట్ అధికంగా ఉంటాయి. ఇవన్నీ శరీరానికి అవసరమే కాబట్టి వీటిని తొక్కతో పాటే వండుకొని తీసుకోవాల్సి ఉంటుంది. చర్మ ఆరోగ్యానికి ఉపయోగపడే సిలికా, జీర్ణక్రియను మెరుగు పరిచే ఫైబర్ కీరాదోస పొట్టులో పుష్కలంగా ఉంటాయట. అందుకే దీన్ని పొట్టుతో తీసుకోవడమే మేలంటున్నారు నిపుణులు.
ఇక, నిమ్మ, బత్తాయి,కమలాఫలం వంటి పండ్ల తొక్కల్లో యాంటీ ఆక్సిడెంట్లు నిండి ఉంటాయి. అయితే వీటిని నేరుగా తినలేం కాబట్టి తొక్కల్ని ఎండబెట్టుకొని పొడి చేసుకొని వంటకాల్లో ఉపయోగించడం వల్ల పోషకాలు పూర్తిగా శరీరానికి అందుతాయి. అలాగే పుచ్చకాయ, తర్బూజా, గుమ్మడి తొక్కల్ని ఉడికించుకొని జామ్ తయారు చేసుకోవచ్చు.పండ్లు, కూరగాయల్లో ఉండే పోషకాలు ఎక్కువగా తొక్కలోనే ఉంటాయి. అందుకే చేజేతులా ఈ పోషకాలను పడేయకుండా కనీసం ఇప్పటి నుంచి అయినా తొక్కతోనే తినండి. అయితే తొక్కతో తీసుకునే ముందు వాటిని శుభ్రం చేయడం మాత్రం మరచిపోవద్దు. మార్కెట్లో దొరికే వెజిటబుల్ ఫ్రూట్ క్లీనర్స్ ని ఉపయోగించండి.