Curry Leaves Benefits: కరివేపాకు తో మధుమేహానికి చెక్
Curry Leaves Benefits: కరివేపాకులో వుండే కొయినిజన్ వంటి కొన్ని రసాయనాలు చక్కెర వ్యాధిగ్రస్తుల పాలిట వరం అంటారు నిపుణులు.
Curry Leaves Benefits: కరివేపాకుకు మన దేశంలో విశిష్ట స్థానమే ఉంది. వంట కు రుచిని సువాసనను ఇవ్వడంలో కరివేపాకు కి ప్రత్యేక స్థానం ఇవ్వక తప్పదు. కూరకి అంత రుచిని ఇచ్చిన కరివేపాకును మాత్రమే ఏరి పారేస్తారు. కరివేపాకు మంచిదని అందరికీ తెలుసు. కానీ, ఇష్టంలేకో లేక అలవాటులో పొరపాటో... కరివేపాకుని తినకపోవడానికి సవాలక్ష కారణాలు వెదుక్కుంటూ వుంటారు కొందరు. కూరల్లో తాలింపుగా ఉపయోగించే ఈ కరివేపాకులో ఎన్నోఔషధాలున్నాయి. అవేంటో మన "లైఫ్ స్టైల్" లో తెలుసుకుందాం.
శరీరానికి ఎంతో అవసరమైన...
కరివేపాకులో శరీరానికి ఎంతో అవసరమైన కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లూ, బి విటమిన్, కెరోటిన్ పుష్కలంగా ఉండటమే కాదు.. తాజా కరివేపాకు నుంచి ప్రొటీన్లు, కొవ్వు పదార్ధాలు, పిండి పదార్ధాలు, పీచు పదార్ధాలు, ఖనిజ లవణాలు, క్యాలరీలు కూడా లభిస్తాయి.
మధుమేహానికి మంచి మందుగా...
కరివేపాకుని మధుమేహానికి మంచి మందుగా పాశ్చాత్యులు సైతం గుర్తించారు. ఇందులోని కొయినిజన్ వంటి కొన్ని రసాయనాలు చక్కెర వ్యాధిగ్రస్తుల పాలిట వరం అంటారు నిపుణులు. ఎలా అంటే, తీసుకున్న ఆహారాన్ని గ్లూకోజ్‌గా మార్చి రక్తంలో చక్కెర శాతాన్ని పెంచేందుకు క్లోమగ్రంధి నుంచి విడుదలయ్యే అల్థాఎమిలేజ్ అనే ఎంజైమే కారణం. కరివేపాకులోని ప్రత్యేక పదార్ధాలు ఈ ఎంజైమ్ స్రావాన్ని తగ్గిస్తాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. జన్యుపరంగా లేదా స్థూలకాయం కారణంగా వచ్చే మధుమేహాన్ని కరివేపాకు ద్వారా నియంత్రివచ్చని ఆయుర్వేద నిపుణులు కూడా స్పష్టం చేస్తున్నారు. ప్రతిరోజూ ఉదయమే పది కరివేపాకుల చొప్పున మూడు నెలలపాటు తింటే స్థూలకాయం, అలాగే రక్తంలో చక్కెర శాతం కూడా తగ్గుతాయని ఆయుర్వేద వైద్యులు తెలిపారు.
టీ రూపంలో కూడా తాగవచ్చు:
కరివేపాకుతో తయారు చేసిన టీ రోజూ తాగితే అనేక ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే ప్రతిరోజు కరివేపాకు టీని తాగాలని వారు సూచిస్తున్నారు.
తయారీ విధానం:
25 నుంచి 30 కరివేపాకులను తీసుకొని.. శుభ్రంగా కడగండి.. అనంతరం ఓ గిన్నెలో ఓ కప్పు నీరు తీసుకుని బాగా వేడి చేయండి..మంట ఆర్పేసి.. ఆ వేడి నీటిలో కడిగిన కరివేపాకుల్ని వేయండి.. ఆకులన్నీ ఆ వేడి వేడి నీటిలో మునిగేలా చేయండి.. నీటి రంగు మారడాన్ని గమనించండి.. అనంతరం ఆ నీటిని కప్పులోకి ఫిల్టర్ చేయండి. ఈ నీటిలో తేనే, బెల్లం కలిపి తాగవచ్చు.. బెల్లం కంటే నల్లబెల్లం కలుపుకుని తాగితే అధిక ప్రయోజనం.. అంతేకాదు ఆ నీటిలో తేనే, నిమ్మరసం, కలిసికూడా తాగవచ్చు. సో ఇంకెందుకు మన రోజువారీ డైట్ లో కరివేపాకు ను చేర్చుకుందాం.