Air Pollution: వాయు కాలుష్యంతో మగవారిలో ఆ సమస్య.. పరిశోధనల్లో షాకింగ్ విషయాలు
ఎక్కువ కాలం వాయు కాలుష్యానికి ప్రభావితం అయ్యే పురుషుల్లో సంతానలేమి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
Air Pollution: రోజురోజుకీ వాయు కాలుష్యం ఓ రేంజ్‌లో పెరిగిపోతోంది. రోడ్లపై వాహనాల రద్దీ పెరగడం, పరిశ్రమల నుంచి వచ్చే విష పూరీతమైన వాయువులు మనిషి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అయితే ఈ వాయు కాలుష్యంగా కారణంగా మనుషుల్లో క్యాన్సర్లు, గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే పలు అధ్యయనాల్లో వెల్లడైంది. అయితే వాయు కాలుష్యం మరో తీవ్ర సమస్యకు దారి తీస్తుందని తాజా పరిశోధనల్లో వెల్లడైంది.
ఎక్కువ కాలం వాయు కాలుష్యానికి ప్రభావితం అయ్యే పురుషుల్లో సంతానలేమి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. డెన్మార్క్‌కు చెందిన పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీర్ఘకాలంగా వాయు కాలుష్యం, ట్రాఫిక్ శబ్దాలకు ఎక్స్‌పోజ్ అయిన మగవారికి సంతానలేమి సమస్య పెరగటానికీ సంబంధం ఉంటున్నట్టు ఈ పరిశోధనల్లో తేలింది.
కలుషిత గాలిలోని రసాయనాలు రక్తం ద్వారా పునరుత్పత్తి వ్యవస్థలోకీ చొచ్చుకెళ్లే అవకాశం ఉన్నాయని, ఇవి శుక్రకణాలను దెబ్బ తీస్తాయని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఇది సంతనలేమికి దారి తీస్తుందని అంటున్నారు. అయితే ఆరోగ్యం మీద వాహనల నుంచి వచ్చే సౌండ్ సంతానోత్పత్తిపై ఏమేర ప్రభావం చూపుతుందన్న దానిపై స్పష్టత రాలేదు. ఒత్తిడి హార్మోన్లను ప్రభావితం చేయటం ద్వారా సంతాన సామర్థ్యాన్ని దెబ్బ తీసే అవకాశం ఉంటుంది.
ఈ అధ్యయనంలో భాగంగా పరిశోధకులు.. ఆరోగ్యం, నివాస ప్రాంతం, ఉద్యోగం, చదువులు, కుటుంబం మధ్య సంబంధాల మీద అధ్యయనం చేశారు. వీరిలోంచి సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారిని, సంతానలేమి సమస్య నిర్ధరణ అయిన పురుషులు, స్త్రీలను గుర్తించారు. అలాగే వారు నివసిస్తున్న ప్రాంతాల్లో రోడ్డు ట్రాఫిక్ శబ్దాల తీవ్రత, వాయు కాలుష్యం మోతాదులనూ లెక్కించారు. వీటన్నింటి అంశాలను పరిగణలోకి తీసుకున్న పరిశోధకులు సంతానలేమి విషయంలో మగవారిలో, ఆడవారిలో కాలుష్యం భిన్నంగా ప్రభావం చూపుతున్నట్టు బయటపడింది.