ఎండలు మండిపోతున్నాయి. సమస్త జీవరాశులు వేడిని తాళలేకపోతున్నాయి. మొక్కల సంగతి ఇక చెప్పనక్కర్లేదు. పెరటిలో పెంచే మొక్కలకైతే ఎండ భూ ఉపరితలం మీద మాత్రమే పడుతుంది. కానీ మిద్దె కాంక్రీటుతో నిర్మించబడి ఉంటుంది. కుండీల్లో మొక్కలు నాటాల్సి వస్తుంది. అందువల్ల కుండీల చుట్టూ కూడా ఎండ పడుతుంది. కాబట్టి మొక్కలు వాడిపోయి, చనిపోతాయి అందుకే ఎండ తీవ్రత నుండి మిద్దె తోటలను రక్షించడానికి షేడ్ నెట్‌యే సరైన పరిష‌్కారమార్గమని నిరూపిస్తున్నాడు భాగ్యనగరవాసి. మొక్కలను వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా కాపాడుకుంటున్నారు.
సుధాకర్ పాలకుర్తి ఈయన న్యూట్రిషియనిస్ట్ అంతే కాదు సేంద్రియ మిద్దె తోటల ప్రచారకర్తగా కూడా గత 9 సంవత్సరాలుగా హైదరాబాద్ నగరవాసులకు సేవను అందిస్తున్నారు. ఈయన స్వయంగా మిద్దె తోటలను నిర్వహించడమే కాకుండా ఆరోగ్యకరమైన జీవనాన్ని సాగించేందుకు తోటి వారికి వీటి వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఎంతో మంది ఈయన ప్రేరణతో టెర్రస్ గార్డెన్‌ను ఏర్పాటు చేసుకున్నారు. మంచి ఫలితాలను సాధిస్తున్నారు.
సాధారణంగా అధిక ఉష్ణోగ్రతల కారణంగా మిద్దె మీద మొక్కలు సరిగా పెరగవు, దిగుబడి రాదు, మొక్కలు చనిపోతాయని చాలా మందికి అపోహ ఉంది అయితే మామూలుగా పెంచితే ఈ ప్రమాదం ఉంది. కానీ అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకుని మేడ మీద మన మొక్కలను ఎంతో సురక్షితంగా కాపాడుకోవచ్చు. టెర్రస్ మీద షేడ్ నెట్‌ను నిర్మించుకుంటే చాలు వేసవిలో వచ్చే అన్ని సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
200 sft లో 10 అడుగుల పొడవుతో షేడ్ నెట్ ను నిర్మించారు. ఇందులో గ్రోబ్యాగులను ఉపయోగించి 30 నుంచి 35 రకాల ఆహార పంటలను పండించుకోవచ్చు. ఓ చిన్న ఫ్యామిలీకి అవసరమైన అన్ని రకాల ఆకుకూరలు, కూరగాయలు పండించుకోవచ్చు ఈ షేడ్ నెట్ ను ఎంతో బలమైన సపోర్టుతో నిర్మించారు. పెద్ద గాలి వచ్చినా చెక్కు చెదరదు. వేసవిలోనే కాదు వర్షాకాలంలో కూడా షేడ్ నెట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. వర్షం కురిసినప్పుడు నేరుగా వర్షపునీరు మొక్కలపై పడదు. అలాగే భలమైన గాలులు వీచినా ఇది మొక్కలను ఎంతో సంరక్షిస్తుంది.