Agriculture News: రైతులకి పెద్ద ఊరట.. ఆ సేవలు ఈ ఏడాది కూడా కొనసాగుతాయి..!
Agriculture News: రైతులకు ఇది శుభవార్తని చెప్పాలి. గతంలో మాదిరిగానే ఈ ఏడాది కూడా వారికి సబ్సిడీపై ఎరువులు అందుతాయి.
Agriculture News: రైతులకు ఇది శుభవార్తని చెప్పాలి. గతంలో మాదిరిగానే ఈ ఏడాది కూడా వారికి సబ్సిడీపై ఎరువులు అందుతాయి. ప్రస్తుతం ఎరువులపై సబ్సిడీని తగ్గించే ప్రతిపాదన కేంద్రానికి లేదు. రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి భగవంత్ ఖూబా పార్లమెంట్ హౌస్‌లో ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ పి అండ్ కె ఎరువులపై సబ్సిడీని తగ్గించే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. రైతులకు తక్కువ ధరకు ఎరువులు అందించడానికి భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్న సంగతి తెలిసిందే.
ఒకవేళ ప్రభుత్వం ఎరువులపై సబ్సిడీని తొలగిస్తే యూరియా బస్తా ధర చాలా ఖరీదు అవుతుంది. ఈ పరిస్థితుల్లో రైతులు ఎరువులు వాడలేని పరిస్థితి నెలకొంటుంది. దేశంలోని ఎరువుల డిమాండ్‌కు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి ఎరువులను దిగుమతి చేసుకుంటుంది. యూరియాపై ప్రభుత్వం 70 శాతం సబ్సిడీ ఇస్తుంది. ఈ కారణంగానే రైతులు యూరియా బస్తాను రూ.266.50కి కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం సబ్సిడీని తొలగిస్తే ఒక్కో బస్తా యూరియాకు రూ.2450 వెచ్చించాల్సి వస్తుంది.
అదేవిధంగా ఒక బస్తా డిఎపి ఎరువుల ధర రూ.1350. సబ్సిడీని తొలగిస్తే దాని ధర రూ.4073 అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు కొనలేని పరిస్థితి నెలకొంటుంది. ఈ రేటుకు రైతులు ఎరువులు కొని వ్యవసాయం చేస్తే తిండి, పానీయాలు చాలా ఖరీదుగా మారుతాయి. ఎందుకంటే రైతులు వ్యవసాయానికి ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. భారత్‌లాగా ఇతర దేశాల ప్రభుత్వాలు ఎరువులపై సబ్సిడీ ఇవ్వడం లేదు.
2022లో ప్రచురించిన నివేదిక ప్రకారం పాకిస్థాన్‌లో యూరియా బస్తా ధర రూ.791. అంటే భారతదేశం కంటే రెట్టింపు ధర. అదేవిధంగా బంగ్లాదేశ్‌లో యూరియా బస్తా ధర రూ.719గా ఉంది. అదే సమయంలో ఎరువులకు అత్యధిక ధర చైనాలో ఉంది. ఇక్కడ రైతులు యూరియా బస్తా కోసం భారతదేశంలో కంటే 8 రెట్లు ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది.