ఉద్దండ కుటుంబాల అడ్రస్‌ ఎలా గల్లంతైంది?

Update: 2019-06-06 14:03 GMT

ఉద్దండ కుటుంబాలు, ఎన్నికల్లో ఊసులేకుండాపోయాయి. నియోజకవర్గాలను సామంత రాజ్యాలుగా ఏలిన పరివారాలు, పత్తాలేకుండా పోయాయి. జిల్లాలో ఎదురులేదు, తిరుగులేదు అని, రొమ్ము విరిచి దమ్ము చూపిన మహామహా నాయకుల ఫ్యామిలీలు, ఫ్యాన్‌ గాలిలో దుమ్ములా కొట్టుకుపోయాయి. దశాబ్దాల వైరాన్ని పక్కనపెట్టి చేతులు కలిపినా, ఓటరన్న కనికరించకుండా పాతాళానికి తొక్కేశాడు. కంచుకోటలని శాసించిన లీడర్లను, వారి సుపత్రులను, సుపుత్రికలను, అన్నదమ్ములను, అందర్నీ ఒకగాటన కట్టి కుమ్మేశాడు. కర్నూలు జిల్లాలో తిరుగులేని మూడు కుటుంబాలు, చెల్లాచెదురయ్యాయి. మరి బలమైన ఈ కుటుంబాలు ఎందుకు దారుణ ఓటమిని చవి చూశాయి వారసత్వ రాజకీయం ఎందుకు బోల్తాపడింది వీరి భవిష్యత్తేంటి?

2019 సార్వత్రిక ఎన్నికలు కర్నూలు జిల్లా రాజకీయాల్లో కొత్త చరిత్రను లిఖించాయి. సరికొత్త బాటను చూపించాయి. మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు పార్లమెంట్‌ స్థానాలుంటే, మొత్తానికి మొత్తం క్లీన్‌స్వీప్ చేసి, చరిత్ర సృష్టించింది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్. అంతేకాదు, చేతులు కలిపిన శత్రువులకు ఈ ఎన్నిక కొత్త పాఠం నేర్పింది. జిల్లా మాదే, నియోజకవర్గాలూ మావే, తాము తప్ప మరొకరు ఇక్కడ గెలిచేది లేదు, గెలవడానికీ లేదు అంటూ దశాబ్దాల పాటు రొమ్ము విరుచుకుని తిరిగిన కొన్ని కుటుంబాలకు ఈ ఎన్నికలు సరికొత్త పాఠం.

కోట్ల కుటుంబానికి జిల్లా రాష్ట్ర, స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో రాజకీయంగా మంచి గుర్తింపు ఉంది. కోట్ల అంటే కర్నూలు కర్నూలు అంటే కోట్ల అనేంతగా ప్రజల్లో గుర్తింపు ఉంది. తండ్రి కోట్ల విజయభాస్కరరెడ్డి ముఖ్యమంత్రిగా జిల్లాకు సైతం ఎంతోకొంత చేశారు. తాగునీటి సమస్యకు పరిష్కారం చూపారన్న కృతజ్ణత ఇప్పటికీ జిల్లా వాసుల్లో ఉంది. మాజీ కేంద్రమంత్రి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డికి సైతం తండ్రి వారసత్వం అబ్బింది. కేంద్రమంత్రిగా ఎన్నోకొన్ని పనులు చేశారు. అయితే ఈ ఎన్నికలు మాత్రం కోట్ల కుటుంబానికి పీడకల మిగిల్చాయి.

దశాబ్దాల వైరాన్ని కాదని కాంగ్రెస్‌ నుంచి టీడీపీలోకి మారింది కోట్ల కుటుంబం. అంతేకాదు జిల్లాలో నువ్వానేనా అన్నంతగా వైరివర్గమైన కేయీతోనూ చేతులు కలిపారు. అయితే వీరు చేతులు కలిపినంత సులభంగా క్షేత్రస్థాయిలో కార్యకర్తలు కలపలేదనడానికి దారుణమైన ఫలితాలే నిదర్శనం. ఈసారి టీడీపీ ఎంపీ అభ‌్యర్థిగా కర్నూలు నుంచి పోటీ చేశారు కోట్ల. ఆయన సతీమణి కోట్ల సుజాతమ్మ ఆలూరు ఎమ్మెల్యేగా బరిలోకి దిగారు. రాజకీయ ఓనమాలు తెలియని కొత్త వ్యక్తయిన వైసీపీ ఎంపీ అభ్యర్థి సంజీవ్ కుమార్ చేతిలో సూర్య ప్రకాశ్ రెడ్డి దారుణంగా ఓడిపోయారు. అటు బీసీ నేత గుమ్మనూరు జయరాం చేతిలో సుజాతమ్మ కూడా పరాజయం మూటగట్టుకున్నారు. కోట్ల కుటుంబంతో టిడిపికి మైలేజీ కచ్చితంగా వస్తుందని భావించిన తెలుగు తమ్ముళ్లకు, ఆ పార్టీ నేతలకు ఫలితాలు పెద్ద షాకునిచ్చాయి. ఇంత దారుణ ఓటమా అంటూ కోట్ల కుటుంబం మధనపడుతోంది.

జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు ఉన్న బలమైన బీసీ కుటుంబం కేఈ ఫ్యామిలీ. 2004 సార్వత్రిక ఎన్నికల్లో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభంజనాన్ని సైతం తట్టుకుని విజయకేతనం ఎగురవేసింది ఈ కుటుంబం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కనీసం గట్టి పోటీని కూడా ఇవ్వలేకపోయింది. ఈ ఎన్నికల్లో తాను తప్పుకుని వారసుడు, తమ్మున్ని బరిలోకి దింపారు కేఈ కృష్ణమూర్తి. పత్తికొండ నుంచి తనయుడు శ్యామ్ బాబు పోటీ చేస్తే డోన్ నియోజకవర్గం నుంచి సోదరుడు కేఈ ప్రతాప్ బరిలోకి దిగారు. కానీ ఇరువురు కూడా ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. కోట్ల ఫ్యామిలీ చేయి అందించినా, శూన్యమే మిగిలిందని కుమిలిపోతున్నారు.

జిల్లాలో మరో బలమైన కుటుంబం భూమా కుటుంబం. టీడీపీ ఆవిర్భావంతో రాజకీయ ఆరంగేట్రం చేసిన ఈ ఫ్యామిలీ, అంచెలంచెలుగా ఎదిగింది. నంద్యాల లోక్‌సభ పరిధిలో తమకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఆళ్లగడ్డతో పాటు నంద్యాలపై కూడా పట్టు సాధించి, తమ సత్తాను చాటింది. హ్యాట్రిక్ సాధించిన ఎంపీగా భూమా నాగిరెడ్డికి రికార్డు ఉంటే, PRP పార్టీలో ఆళ్లగడ్డ నుంచి జయకేతనం ఎగురవేసిన నేతగా శోభానాగిరెడ్డి నిలిచిపోతారు. తల్లి మరణంతో ఎమ్మెల్యేగా, తండ్రి మరణంతో మంత్రిగా తెరపైకి వచ్చిన భూమా అఖిలప్రియ, ఆ కుటుంబాన్ని నమ్ముకున్న కార్యకర్తలకు, అభిమానులకు అండగా ఉంటామని భరోసా కల్పించడంలో పూర్తిగా సఫలం అయ్యారు. కానీ రాజకీయ అనుభవం లేకపోవడంతో చతికిలబడ్డారు. తొలిసారి ప్రత్యక్ష రాజకీయాలు చేస్తుండడంతో ఓటు బ్యాంకును కాపాడుకోలేకపోయారని విశ్లేషిస్తున్నారు రాజకీయ పండితులు.

భూమా నాగిరెడ్డి మరణంతో ఉపఎన్నికల్లో ఊహించని మెజారిటీతో విజయాన్ని కైవసం చేసుకున్న భూమా బ్రహ్మానందరెడ్డి సైతం ఓటమిపాలయ్యారు. తనకు అవకాశం ఇచ్చిన అనతికాలంలోనే అభివృద్ధి అంటే ఏంటో చూపించానని, అదే తనకు పట్టం కడుతుందని బలంగా విశ్వసించారు. కానీ జగన్ ప్రభంజనంలో అవేమీ నిలవలేకపోయాయి. దీంతో ఆళ్లగడ్డలో అక్క అఖిలప్రియ ఓటమిపాలైతే, నంద్యాలలో తమ్ముడు బ్రహ్మన్న పరాజయం మూటగట్టుకున్నాడు. భూమా కుటుంబం నుంచి బరిలోకి దిగిన ఇద్దరు నేతలు ఓటమి చవిచూడాల్సి వచ్చింది.

మొత్తానికి కర్నూలు జిల్లా రాజకీయ చరిత్రలో, ఈ ఎన్నికలు శాశ్వతంగా నిలిచిపోతాయి. ఉద్దండ కుటుంబాలను ప్రజలు పక్కనపెట్టారు. నియోజకవర్గాలు కుటుంబాల కంచుకోటలు కాదని, దశాబ్దాల మంకుపట్టు రాజకీయాలను బద్దలుకొట్టారు ఓటర్లు. ఇప్పుడు ఈ ఓటమిపైనే, కోట్ల, కేఈ, భూమా కుటుంబాలు సమీక్షలు చేసుకుంటున్నాయి. పరాజయానికి కారణాలు వెతుక్కుంటున్నాయి.

Full View 

Tags:    

Similar News