సంచలనం సృష్టించిన చిగురుపాటి జయరాం హత్య కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. కేసును ఏపీ పోలీసులు తెలంగాణకు బదిలీ చేయడంతో హైదరాబాద్ పోలీసులు కొత్తగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ మొదలు పెట్టారు. నిందితులైన రాకేష్ రెడ్డి, శ్రీనివాస్ లకు నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది.
ఈ కేసులో మొదటి నుండి ఆరోపణలు ఎదుర్కొంటున్న జయరాం మేనకోడలు శిఖా చౌదరిని జూబ్లీహిల్స్ పోలీసులు నేడు విచారించనున్నారు. శిఖా చౌదరికి జూబ్లీహిల్స్ పోలీసులు ఫోన్ చేసి ఏసీపీ ముందు విచారణ కోసం 10 గంటలకు రావాల్సిందిగా చెప్పారు. విచారణ కోసం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు శిఖా చౌదరి రానున్నారు. శిఖా చౌదరికి జయరాంకి మధ్య ఉన్న సంబంధాలు రాకేష్ శిఖాకి మధ్య ఉన్న పరిచయాలపై ఆమెను ప్రశ్నించే అవకాశం ఉంది దీనితో పాటు వీరి ముగ్గురి మధ్య ఉన్న ఆర్థిక సంబంధాలపై కూడా పోలీసులు ఆరా తీయనున్నారు.
శిఖా చౌదరి పని మనిషి, వాచ్‌మెన్ , స్నేహితులను జూబ్లీహిల్స్ పోలీసులు రహస్య ప్రదేశంలో ఇప్పటికే విచారించినట్లు తెలిసింది. వారు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కూడా రాకేష్ , శ్రీనివాస్, శిఖాను మరింత లోతుగా విచారణ చేసేందుకు సిద్ధం అయ్యారు పోలీసులు.