కట్టుకున్న భార్యపై అనుమానం పెంచుకున్న ఆ వ్యక్తి ఉన్మాదిగా మారాడు. తలపై ఇనుప రాడ్డుతో కొట్టి ఆమెను కిరాతకంగా హత్యచేశాడు. నాలుగేళ్ల వయసున్న కొడుకును నిండా నీళ్లున్న బకెట్లో తలకిందులుగా ముంచి చంపాడు. హైదరాబాద్ సనత్‌నగర్‌లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ దేవరియాజిల్లా కాగజ్గడ్కు చెందిన రాజేశ్ తీవ్ర వేధింపులకు గురిచేయడంతో మొదటి భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం దాచిపెట్టి ఏడేళ్ల క్రితం ఊర్మిళను పెళ్లిచేసుకున్నాడు. వీరికి నాలుగేళ్ల కుమారుడు కిషన్ ఉన్నాడు. దీపక్ బతుకుదెరువు కోసం బంధువులు దీపక్, చందాలతో కలిసి రాజేష్ కుటుంబం యూపీ నుంచి ఈ నెల 10న హైదరాబాద్‌కు వచ్చింది. సనత్‌నగర్ పరిధిలోని జింకలవాడలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని నివాసం ఉంటుంది.
రాజేశ్, ఊర్మిళలు పనిదొరక్క పోవడంతో ఇంట్లోనే ఖాళీగా ఉంటున్నారు. ఆదివారం ఉదయం దీపక్, చందా పనులకు బయటకు వెళ్లారు. మధ్యాహ్నం దీపక్ వచ్చేసరికి ఇంటికి తాళం వేసి ఉంది. రాజేశ్‌కు ఫోన్ చేయగా స్విచాఫ్ రావడంతో అనుమానించాడు. స్థానికుల సాయంతో తాళం పగులగొట్టి లోపలికి వెళ్లగా అక్కడి భీతావహ దృశ్యాలను చూసి అంతా ఉలిక్కిపడ్డారు. తల పగిలి ముఖమంతా నెత్తుటి ధారలతో ఉర్మిళ ఆమె పక్కన కిషన్ శవాలై పడి ఉన్నారు.
ఈ దారుణం గురించి సమాచారం అందుకున్న సనత్ నగర్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని ఆధారాలు సేకరించారు. భార్యను రాజేష్ రాడ్డుతో కొట్టి హత్య చేశాడు. నాలుగేళ్ల కుమారుడు కిషన్ ను నీళ్లున్న బకెట్లో తలకిందులుగా ముంచి చంపినట్లు నిర్ధారించారు. భార్యపై అనుమానంతోనే రాజేష్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు బంధువులు ఆరోపించారు. పరారీలో ఉన్న నిందితుడు రాజేష్ కోసం పోలీసులు వేట ప్రారంభించారు.