కర్ణాటక రాష్ట్రంలోని విజయపుర జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రేష్మా పడెకనూర్ దారుణ హత్యకు గురయ్యారు. గురువారం రాత్రి అదృశ్యమైన ఆమె శుక్రవారం శవమై కనిపించారు. బసవనబాగేవాడి తాలుకాలో కృష్ణానదిపై నిర్మించిన కొల్హార్ బ్రిడ్జి సమీపంలో ఆమె మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. గురువారం తెలిసిన వ్యక్తితో కలిసి తన కారులో బయటికి వెళ్లింది రేష్మా. ఆ తర్వాత ఎక్కడికి వెళ్లింది? ఏమైంది? అనే వివరాలు తెలియరాలేదు. కోల్హాపూర్ సమీపంలో ఉన్న కృష్ణ నదీ తీరంలో రేష్మ శవమై కనిపించింది. ఆమెను దారుణంగా హత్య చేసిన దుండగులు శవాన్ని నదీ తీరంలో పడేసి పారిపోయారు. హత్య కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరకముందు జేడీఎస్ పార్టీకి జిల్లా అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహించారు రేష్మా. 2013 జేడీఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే సీటు ఆశించిన రేష్మాకు ఆ పార్టీ గట్టి షాక్ ఇచ్చింది. వేరే వ్యక్తికి సీటు కేటాయించడంతో ఆగ్రహానికి గురైన రేష్మా గత అసెంబ్లీ ఎన్నికల ముందు విజయపుర జేడీఎస్ ప్రెసిడెంట్ బాధ్యతల నుంచి తప్పుకుని, కాంగ్రెస్ పార్టీలో చేరారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొన్న రేష్మా ఫలితాలు దగ్గర పడుతున్న సమయంలో ప్రాణాలు కొల్పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆమె మరణంపట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు దిగ్భాంతి వ్యక్తం చేశారు.