ఉండవల్లి మలి ప్రస్థానంపై చెలరేగుతున్న ఊహాగానాలేంటి?

Update: 2019-06-06 12:45 GMT

ఉండవల్లి అరుణ్ కుమార్. రా‌ష్ర్ట రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని నాయకుడు. సబ్జెక్టు ఏదైనా దుమ్ముదులిపే వక్త. విభజన చట్టం నుంచి నవ్యాంధ్ర తొలి ప్రభుత్వం దాకా, సకల సమస్యలను ఎత్తి చూపే లీడర్. రాజమండ్రి మాజీ పార్లమెంటు సభ్యుడుగా పదవీకాలం ముగిశాక తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు ఉండవల్లి. ఏ రాజకీయ పార్టీతో అనుబంధం పెట్టుకోలేదు. ప్రభుత్వాల పనితీరు, లోపాలను ఎండగట్టే పనిలోనే ఉండవల్లి కొనసాగారు. అయితే వైఎస్సార్‌కు సన్నిహితుడైన ఉండవల్లి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే, కొత్త ప్రభుత్వానికి దగ్గరవుతారని జోరుగా ప్రచారం సాగింది. ఇప్పటికీ అలాంటి ప్రచారానికి ఫుల్‌స్టాప్ పడలేదు. మరి ఉండవల్లి అడుగులు ఎటువైపు ఏ రాజకీయ పార్టీవైపు వెళ్లరా ఈ ఐదేళ్లు కూడా ప్రభుత్వ తప్పొప్పులను ఎత్తి చూపే పనిలోనే నిమగ్నమవుతారా? అందరి శకునాలు చెప్పే ఉండవల్లి శకునమేంటి?

రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు దేశ రాజకీయాల్లో కూడా రాజమండ్రి మాజీ ఎంపి ఉండవల్లి అరుణ‌్ కుమార్‌ది ఓ ప్రత్యేకమైన శైలి. ఏపీ విభజనపై పార్లమెంటులో ఫైట్ చేసిన వారిలో ఉండవల్లిది ప్రత్యేక పాత్ర. విభజన చట్టంలోని ప్రతి పాయింట్‌ను టచ్ చేస్తూ, ఈ ఐదేళ్లలో ఎలుగెత్తిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే, ఆయన ఉండవల్లి అరుణ‌ కుమారే.

ఏఐసిసి నాయకురాలు సోనియాగాంధీతో ఏపీ నుంచి నేరుగా మాట్లాడే నేతగా ఉండవల్లికి అప్పట్లో పెద్దపేరు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు నుంచి కూడా, ఆ‍యనకు అత్యంత సన్నిహితుడు ఉండవల్లి. కెవీపీ రామచంద్రరావు, వైఎస్, ఉండవల్లి అరుణ్ కుమర్‌లు ఏపీలో ఏం స్కెచ్ వేస్తే అదే ఏఐసిసిలో ఆమోదం అయ్యేది. వైఎస్సార్‌కు, సోనియాగాంధీకి మధ్య వారధిగా ఉండవల్లి వ్యవహరించేవారంటే అతిశయోక్తికాదు.

అలాంటి ఉండవల్లి అరుణ్ కుమార్ పార్లమెంటులో ఏపీ విభజన చట్టం ఆమోదం సమయంలో, పార్టీ నుంచి బహిష్కరించి పార్లమెంటు తలుపులు మూసి విభజన చేయడాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఇప్పటికీ అవే అంశాలు మీడియా ముందు ప్రస్తావిస్తూ వుంటారు. విభజన చట్టబద్దంగా జరగలేదనే వాదనకు ఇప్పటికీ అరుణ్ కుమార్ కట్టుబడి వున్నారు. నాటి పరిణామాలు తర్వాత కాంగ్రెస్ పార్టీకి దూరమైన ఉండవల్లి, తిరిగి సోనియాగాంధీని నేటి వరకూ కలవలేదు. కాంగ్రెస్ అంటే ఉండవల్లి, ఉండవల్లి అంటే కాంగ్రెస్ అనే నినాదంగా వ్యవహారం ఉండేది. అలాంటి ఉండవల్లి కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్నాడంటే నమ్మశక్యం కాదు. కానీ ఆయనలో పట్టుదల అలా చేసింది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తనను బహిష్కరించింది కాబట్టి, తిరిగి ఎత్తివేయాలో లేదో ఆ పార్టీ అధిష్టానమే చూసుకోవాలనే పంతం ఆ‍యనది. తాను అడిగే ప్రసక్తేలేదని ఉండవల్లి భీష్మించుకుని కూర్చున్నారు. పైగా ఏపీలో సోనియాగాంధీ ఎన్నికల ప్రచారానికి వస్తే ముందుగా ఏపీ ప్రజలకు విభజన చేసినందుకు క్షమాపణలు చెప్పాలనే షరతు కూడా ఉండవల్లి విధించారనే ప్రచారం వుంది.

ఇలా ప్రత్యక్ష రాజకీయాలకు దూరమైన ఉండవల్లి నిత్యం ప్రజల మధ్యనే వున్నారు. గత తెలుగుదేశం ప్రభత్వం ఐదేళ్లు ఎపుడెప్పుడు ఎక్కడెక్కడ తప్పటడుగులు వేసింది, పోలవరం ప్రాజెక్టులో అవకతవకలు, పట్టిసీమ, పురుషోత్తమపట్నంలలో అంచనాలు అక్రమంగా పెంపు, వంటి అంశాలను ఎప్పటికప్పుడు మీడియా ద్వారా జనం ముందుకు తెచ్చారు ఉండవల్లి. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక హోదా అంశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన మేధావుల జెఎసీ సమావేశానికి ఉండవల్లి హాజరైనపుడు, ఆయన రాజకీయ భవితవ్యంపై రాజకీయ ఊహాగానాలు వచ్చాయి. ఆ తర్వాత సిఎం చంద్రబాబును అమరావతిలో కలిసినప్పుడు కూడా టీడీపీలోకి వెళుతున్నాన్న పుకారు చెలరేగింది. అయితే ఏపీ విభజన హామీలు, విభజన చట్టంలో లోపాలు, దానిపై పోరాటం చేసే అంశాలు వివరించేందుకు కలిశానని, పార్టీలోకి వెళ్లడం గురించి కాదని క్లారిటీ ఇచ్చారు ఉండవల్లి. అపుడు, ఇపుడు కూడా కేవలం తనకున్న సమాచారాన్ని కేంద్రంపై పోరాటం చేసేందుకు అందించడానికే చర్చలు జరిపాను తప్ప, రాజకీయ ప్రాధాన్యత ఏదీలేదని అప్పట్లోనే ఉండవల్లి కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశారు. అయితే, తాజాగా ఏపీలో వైసీపీ ప్రభంజనం మోగించడంతో ఆయన రాజకీయ అడుగులు ఎటు అన్నది మరోసారి చర్చనీయాంశమైంది.

ఏపీలో వైసీపీ ఘనవిజయం సాధించిన దరిమిలా ఉండవల్లి అరుణ్ కుమార్, జగన్ ప్రభుత్వానికి దగ్గరవుతారనే ప్రచారం సాగింది. జగన్ ప్రభుత్వానికి సలహాదారునిగా ఉండవల్లి వుండొచ్చునేమోనన్న పుకార్లు షికార్లు చేశాయి. అయితే ఎపుడూ పాలకుల తప్పుల్ని వెతుకుతూ బయట పెట్టే పాత్ర పోషించిన ఉండవల్లి, ఆ దిశగా ఏమీ స్పందించలేదు. పైగా అభినందనలు తెలిపేందుకు జగన్‌ను ఉండవల్లి అరుణ్ కుమార్ నేరుగా కూడా కలవలేదు. అయితే మీడియా ద్వారా జగన్‌కు అభినందనలు తెలిపిన ఉండవల్లి అరుణ్ కుమార్, మంచిపరిపాలన అందిస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. వైఎస్సార్ లాగా పరిపాలన సాగిస్తాడనే నమ్మకం వుందన్న ఉండవల్లి, ఆచితూచి పరిపాలనలో ముందుకు వెళ్లాల్సిన అవసరం కూడా ఉందని చెప్పుకొచ్చారు.

తాను రాజకీయాల్లోకి తిరిగి వెల్లదల్చుకోలేదని, ప్రభుత్వంలో తప్పులుంటే తప్పుగా, ఒప్పువుంటే ఒప్పగా ఇలా మీడియా ముందే చెబుతానని, తాను ఏపార్టీకి వెళ్లను, ఆ ఉద్దేశ్యం లేదని ఉండవల్లి మీడియా సమావేశంలో తేల్చిచెప్పేశారు. అయితే తన మిత్రులు అంతా ఉండవల్లి రాజకీయాల్లోకి తిరిగి రావాలని కోరుకుంటున్నారు. కొందరైతే ప్రస్తుతం వున్న విధానంలోనే వుండమని సూచిస్తున్నారు. రివర్స్ టెండరింగ్ విధానం తీసుకువస్తానని జగన్ నిర్ణయించడం, జ్యూడిషియల్ కమీషన్ పర్యవేక్షణలో టెండర్ల వ్యవస్థను నడిపిస్తామని చెప్పడం మంచి పరిణామాలేని ఉండవల్లి కితాబిచ్చారు. జగన్ను ఈ మధ్యకాలంలోనే తాను కలవలేదని, తమ ఇంటికి పరామర్శకు వచ్చినపుడే కలిశామని ఉండవల్లి చెబుతున్నారు.

జగన్‌ను గతంలో కానీ, ఇపుడుకానీ ఉండవల్లి నేరుగా కలవకపోవడానికి కొన్ని కారణాలు లేకపోలేదు. వైఎస్సార్‌కు అత్యంత సన్నిహితుడైన ఉండవల్లి అరుణ్ కుమార్, వైఎస్ ప్రభుత్వంలో అనేక విషయాలలో సూచనలు, సలహాలు ఇస్తూ వుండేవారు. ఉండవల్లితో సంప్రదించకుండా, చర్చించకుండా వైఎస్ ఏ కొత్తపథకం ప్రవేశపెట్టేవారు కాదంటే అతిశయోక్తి కాదు. వైఎస్సార్ అకాల మరణం తర్వాత కాంగ్రెస్ అధిష్టానాన్ని వ్యతిరేకించిన జగన్, సొంతంగా ఓదార్పు యాత్ర మొదలు పెట్టారు. ఆ యాత్ర కొనసాగివ్వకుండా చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం శతవిధాలా అప్పట్లో ప్రయత్నం చేసింది. అయినా జగన్ జగమొండిలాగా ఓదార్పు యాత్రను తూర్పు గోదావరిజిల్లా తుని నుంచి ప్రారంభించారు. తునిలో ఓదార్పు యాత్ర ప్రారంభం రోజున ఉదయాన్నే, ఉండవల్లి అరుణ్ కుమార్ తుని వెళ్లి యాత్రలో వుండగానే కారులో జగన్‌తో కొంతసేపు చర్చించారు. సోనియాగాంధీ చెప్పిన మాటల్ని జగన్‌కు చెప్పిన ఉండవల్లి, ఓదార్పు యాత్ర ఆపాలని సూచించారు. అయితే మధ్యలోనే జగన్ కారు దిగి వెళ్లిపోయారు ఉండవల్లి. ఆరోజు వారిద్దరి మధ్య ఏం జరిగిందో నేటికీ స్పష్టంగా బయటకు తెలియదు. అయితే అధిష్టానం రాయబారం మాత్రం ఫలించలేదు. అప్పట్నుంచి ఉండవల్లి అరుణ్ కుమార్ వైసీపీ అధినేత జగన్‌ను ఎక్కడా ప్రత్యేకంగా, రాజకీయంగా కలవలేదు. ఇలాంటి పరిణామాలతో ఉండవల్లి ఇప్పటికిప్పుడు ఏ రాజకీయపార్టీతోనూ జతకట్టరని తేలిపోయింది. అదే విషయాన్ని ఉండవల్లి స్పష్టం చేశారు కూడా.

అంతేకాదు వైఎస్సార్‌తో తనకున్న అనుబంధాన్ని ఈ మధ్యనే ఉండవల్లి అక్షరరూపంలో తీసుకువచ్చారు. అందులో వైఎస్సార్‌తో తనకు గల అనుభవాలను క్లుప్తంగా రాశారు ఉండవల్లి. మరి భవిష్యత్‌లో ఉండవల్లి రాజకీయభవితవ్యం ఎలా వుంటుందో, ఆయన నిర్ణయాలు ఎలా వుంటాయో చూడాలి.

Tags:    

Similar News