Top 6 News @ 6PM: రుషికొండ ప్యాలెస్‌ని ఏం చేయాలి? ఆలోచనలో పడిన చంద్రబాబు

Update: 2024-11-02 12:30 GMT

Top 6 News @ 6PM: ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాజకీయ, సినీ, వ్యాపార, క్రీడా రంగాల్లో చోటుచేసుకున్న ముఖ్యమైన ఘటనలు, వాటికి సంబంధించిన వార్తాంశాలను ఇప్పుడు ఒకసారి క్లుప్తంగా పరిశీలిద్దాం.

1) తెలంగాణదే రికార్డు.. మోదీకి రేవంత్ రెడ్డి కౌంటర్

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అభివృద్ధి కుంటుపడిందని ప్రధాని మోదీ ఆరోపించిన విషయం తెలిసిందే. ఆచరణ సాధ్యం కానీ హామీలను ఇచ్చామని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడిప్పుడే గ్రహిస్తోందని మోదీ చేసిన ఆరోపణలకు సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ ద్వారా స్పందించారు. బీజేపి అధికారంలో ఉన్న రాష్ట్రాల కంటే మేమే ఎంతో ముందంజలో ఉన్నామని అన్నారు. అధికారం చేపట్టిన రెండు రోజులకే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అందించామన్నారు. ఏడాది కాకముందే రాష్ట్రంలో 22 లక్షల మంది రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేశామని చెప్పారు. రైతు రుణమాఫీ కోసం కేవలం 25 రోజుల్లోనే 18 వేట్ల నిధులు వెచ్చించామని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు.

ఆరోగ్యశ్రీ కింద రూ. 10 లక్షల వరకు ఉచితంగా చికిత్స అందించే హామీని అమలు చేశామన్నారు. దేశమంతటా ఎల్పీజీ సిలిండర్ ధరలు భగ్గుమంటుంటే తెలంగాణలో మాత్రం రూ. 500 సిలిండర్ అందిస్తున్నామని తెలిపారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా కేవలం 11 నెలల వ్యవధిలోనే ఎప్పటికప్పుడు రిక్రూట్మెంట్స్ చేపట్టడం ద్వారా 50 వేలకు పైగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించామని అన్నారు. ఉద్యోగాల భర్తీలో బీజేపి అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంతో పోల్చినా మాదే రికార్డు అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

2) రేవంత్ రెడ్డి అమలు చేయని హామీల జాబితా: హరీష్ రావు

100 రోజుల్లో హామీలన్నీ అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి 300 రోజులైనా హామీలు అమలు చేయడం లేదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం తొమ్మిదేళ్లలో లక్షా 60 వేల ఉద్యోగాలు భర్తీ చేసినప్పటికీ రేవంత్ రెడ్డి ఇంకా కేసీఆర్ సర్కారుపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు భర్తీ చేసినట్లుగా చెప్పుకుంటున్న 50 వేలకు పైగా ఉద్యోగాలు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చినవే అన్నారు.

బీఆర్ఎస్ సర్కారు హయాంలోనే ఆ ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించి, సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా పూర్తయింది. అంతలోనే ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో నియామక ప్రక్రియ ఆగిపోయింది. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత ఆ నియామక పత్రాలు ఇచ్చారు. ఆ ఉద్యోగాలు కూడా కాంగ్రెస్ ఖాతాలో కలుపుకుంటే ఎలా అని హరీష్ రావు ప్రశ్నించారు. నెలలయినా 4 వేల ఫించన్ లేదు. 18 ఏళ్లు నిండిన మహిళలకు ఇస్తామని చెప్పిన రూ. 2500 లేవు. విద్యా భరోసా కింద విద్యార్థులకు ఇస్తామని చెప్పిన రూ. 5 లక్షలు ఇవ్వలేదు. కల్యాణ లక్ష్మి పథకం లబ్ధిదారులకు తులం బంగారం ఇవ్వడం లేదు. విద్యార్థినులకు ఎలక్ట్రిక్ వాహనాలు ఇస్తామని చెప్పి ఇవ్వలేదు అంటూ హరీష్ రావు గుర్తుచేశారు.

3) ఏపీలో పెట్టుబడి అవకాశాలను వివరించిన మంత్రి నారా లోకేష్

ఏపీ మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటన ముగిసింది. ఏపీకి పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా అమెరికా పర్యటన కొనసాగింది. ఈ వారం రోజుల పర్యటనలో అనేక పారిశ్రామికవేత్తలు, మల్టీనేషనల్ ఐటి కంపెనీల ప్రతినిధులతో నారా లోకేష్ భేటీ అయ్యారు. ఆయా కంపెనీలకు సంబంధించిన ముఖ్యమైన కేంద్రాలను ఏపీలో ప్రారంభించాలని వారిని కోరారు. అమెరికా పర్యటనలో చివరి రోజున న్యూయార్క్‌లోని విట్ బై హోటల్‌లో పారిశ్రామికవేత్తలతో సమావేశమైన లోకేష్.. రాష్ట్రంలో వివిధరంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించినట్లు తెలిపారు.

"బ్లూప్రింట్‌తో వచ్చే పరిశ్రమలకు ఎటువంటి జాప్యం లేకుండా వెంటవెంటనే అనుమతులు ఇవ్వనున్నట్లు చెప్పారు. " 974 కి.మీ.ల సువిశాల తీరప్రాంతానికి అనుసంధానంగా రోడ్డు, ఎయిర్ కనెక్టివిటీ అందుబాటులో ఉందన్నారు. రాబోయే 18 నెలల్లో విశాఖ సమీపంలోని భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు అదుబాటులోకి రానున్నట్లు తెలిపారు. రవాణాపరమైన సమస్యలు లేకుండా మూలపేట, కాకినాడ గేట్ వే, మచిలీపట్నం, రామాయపట్నంలలో 4 కొత్త పోర్టులు అందుబాటులోకి వస్తాయన్నారు. ఆయా పరిశ్రమల అవసరాలకు తగ్గట్లుగా మానవవనరులను సిద్ధం చేసేందుకు దేశంలోనే తొలిసారిగా స్కిల్ సెన్సస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని అన్నారు. అమరావతిలో ఏర్పాటు కానున్న ఆర్టిఫిషియల్ యూనివర్సిటీతో అంతర్జాతీయస్థాయి ఎఐ నిపుణులు తయారవుతారవుతారని మంత్రి నారా లోకేష్ ధీమా వ్యక్తంచేశారు.

4) రుషికొండ ప్యాలెస్‌ని ఏం చేయాలి?

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రుషికొండ ప్యాలెస్‌ని పరిశీలించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రూ. 500 కోట్లతో ఇక్కడ నిర్మించిన ఏడు బ్లాకుల నిర్వహణ కోసం భారీగా ఖర్చు అవుతోందని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే వాటిని ఏ విధంగా ఉపయోగించుకుంటే ఆ అధిక భారాన్ని పూడ్చుకునే అవకాశం ఉంటుందనే కోణంలో చంద్రబాబు అక్కడి అధికారులతో మాట్లాడారు. విశాఖ పర్యాటక కేంద్రం కావడంతో పర్యాటక రంగం అభివృద్ధికి ఊతమిచ్చేలా ఈ భవనాలను ఉపయోగించుకుంటే ఎలా ఉంటుందనే కోణంలో చంద్రబాబు ఆరా తీస్తున్నారు. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు కూడా చంద్రబాబుతో ఉన్నారు.

5) అమిత్ షాపై కెనడా ఆరోపణలు.. ఘాటుగా స్పందించిన భారత్

కెనడాలో ఖలిస్తానీ వేర్పాటు వాదులపై జరుగుతున్న దాడుల వెనుక భారత హోంశాఖ మంత్రి అమిత్ షా హస్తం ఉందని కెనడా ఆరోపించిన సంగతి తెలిసిందే. కెనడా చేసిన ఈ ఆరోపణలపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఈ విషయమై ఇప్పటికే కెనడా దౌత్యవేత్తను పిలిపించి మాట్లాడినట్లు భారత విదేశాంగ శాఖ శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది.

అమిత్ షాపై కెనడా డిప్యూటీ ఫారెన్ మినిస్టర్ డేవిడ్ మోరిసన్ చేసిన ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. భారత్ పై నిరాధారమైన ఆరోపణలు చేస్తే సహించేది లేదని కెనడాకు స్పష్టంచేసినట్లు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ మీడియాకు తెలిపారు. అంతర్జాతీయ మీడియాకు అమిత్ షా పేరు చెప్పడం అనేది కెనడా కావాలని చేసిన కుట్రగానే భావిస్తున్నట్లు భారత్ స్పష్టంచేసింది.

Full View

6) ఇజ్రాయెల్, అమెరికాకు ఇరాన్ వార్నింగ్

ఇజ్రాయెల్, అమెరికాలను హెచ్చరిస్తూ ఇరాన్ అధినేత అయతుల్లా అలీ ఖమెనీ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇరాన్ తో పాటు ఇరాన్ మిత్రపక్షాలపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోం అని ఖమెనీ హెచ్చరించారు. ఇజ్రాయెల్, అమెరికాలను ఉద్దేశించి ఒక ప్రకటన విడుదల చేసిన ఖమేనీ.. ఇరాన్ పై వాళ్లు చేస్తోన్న దాడులకు తాము మరింత ధీటుగా స్పందిస్తామని స్పష్టంచేశారు.

ఇప్పటికే ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న దాడులు తీవ్రస్థాయికి చేరాయి. మరోవైపు లెబనాన్‌లో ఇజ్రాయెల్ గ్రౌండ్ ఎటాక్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ఈ తరుణంలో ఇరాన్ చేసిన ఈ ప్రకటన మిడిల్ ఈస్ట్‌లో మరింత వేడిరాజేస్తోంది.

Tags:    

Similar News